అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో ప్లేస్మెంట్ డ్రైవ్

by Muthe.Rajitha |

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థుల కోసం క్యాంపస్‌లో ప్రత్యేకంగా నిర్వహించిన ప్లేస్‌మెంట్ డ్రైవ్ లో 200 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు.

అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో ప్లేస్మెంట్ డ్రైవ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థుల కోసం క్యాంపస్‌లో ప్రత్యేకంగా నిర్వహించిన ప్లేస్‌మెంట్ డ్రైవ్ లో 200 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మంగళవారం వర్సిటీలో రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (రాసి) సహకారంతో జరిగిన ఈ డ్రైవ్‌లో, స్టయిఫండ్ ఆధారిత అప్రెంటీస్‌షిప్ ప్రోగ్రామ్ కింద నమోదు చేసుకున్న విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో టాటా గ్రూప్‌కు చెందిన వెస్ట్‌సైడ్, ఎలక్ట్రానిక్స్ రిటైలర్ పై ఇంటర్నేషనల్, అపోలో ఫార్మాస్యూటికల్స్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ డ్రైవ్‌లో కోర్సులో చేరిన తొలి 200 మంది అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు.

ఉద్యోగాలకు ఎంపికైన వారికి స్పాట్ ఆఫర్ లెటర్లు, ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి, కోర్సు ఫీజు చెల్లించినట్లయితే, అక్కడికక్కడే ఆఫర్ లెటర్లు అందజేశారు. వీరు సెప్టెంబర్ 1 నుంచి ఆయా సంస్థల్లో చేరవచ్చు. ఫీజు చెల్లించని విద్యార్థులు, ఫీజు కట్టిన వెంటనే ఉద్యోగంలో చేరడానికి అవసరమైన ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

నెలకు రూ.13,000 కనీస స్టయిఫండ్

ఈ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌కు హాజరైన వారిలో ఎంపికైన విద్యార్థులకు కనీస స్టయిఫండ్ నెలకు రూ.13,000గా నిర్ణయించారు. కొన్ని సంస్థలు వసతి, భోజన సౌకర్యాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చాయి. మరో 15 రోజుల్లో, ఈ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకున్న తదుపరి 325 మంది అభ్యర్థులకు కూడా మరో ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణారెడ్డి, ఈఎంఆర్ అండ్ ఆర్సీ డైరెక్టర్ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్, యూజీసీ-డీఈబీ డైరెక్టర్ ప్రొ. పల్లవి కాబ్డే, ప్లేస్‌మెంట్ అధికారి డా. పి. వేణు గోపాల్ రెడ్డి, రాసీ (సౌత్ రీజియన్) ఇండస్ట్రీ అండ్ అకాడెమియా జనరల్ మేనేజర్ చందా వడ్డే తదితరులు పాల్గొన్నారు.

Next Story