- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మధ్యాహ్న భోజన పథకం పై పైలట్ ప్రాజెక్టు విజయవంతం
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం(మిడ్ డే మీల్స్) బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం(మిడ్ డే మీల్స్) బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బిల్లులను పూర్తిగా ఆన్‌లైన్‌లో చెల్లించే విధానాన్ని అమలు చేయనుంది. దీనివల్ల బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండటం, ఏజెన్సీలు, కార్మికుల ఆర్థిక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఈ కొత్త విధానాన్ని మూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా(పైలట్ ప్రాజెక్ట్) అమలు చేయగా, అది విజయవంతమైందని అధికారులు తెలిపారు. దీంతో ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
ఈ ఆన్‌లైన్ విధానాన్ని ఇప్పటికే కొత్తగూడెం, నారాయణపేట, పెద్దపల్లి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రాజెక్టులో ఏ రోజు విద్యార్థుల డేటా ఆ రోజు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయగా, అది అధికారులకు నేరుగా అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం వల్ల బిల్లుల ప్రక్రియ వేగవంతమైందని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ ఆన్‌లైన్ చెల్లింపుల ప్రక్రియను అమలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. దీనికి అనుగుణంగా వెబ్‌సైట్‌లో మార్పులు చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు డేటా అందుబాటులో..
ఈ కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత, రోజువారీగా విద్యార్థుల హాజరు తో పాటు వారికి అందించే గుడ్లు, అరటిపండ్లు, రాగిజావ, బియ్యం వంటి వాటి వివరాలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఎప్పటికప్పుడు డేటా అధికారులకు అందుబాటులో ఉండి, బిల్లుల ఆమోదం, చెల్లింపుల ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగవంతంగా జరుగుతుంది. ఈ ఆన్‌లైన్ విధానంలో ఏ రోజు బిల్లులకు సంబంధించిన డేటా ఆ రోజు అధికారులకు చేరుతుంది. దీనివల్ల బిల్లుల ఆమోదం, చెల్లింపుల ప్రక్రియ వేగవంతం అవుతుంది. గతంలో మాదిరిగా భారీ మొత్తంలో బిల్లులు పేరుకుపోయి, నెలల తరబడి పెండింగ్‌లో ఉండే పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు.
కార్మికుల ఆందోళనలకు చెక్..
మధ్యాహ్న భోజన పథకం కింద పని చేస్తున్న ఏజెన్సీ కార్మికులకు బిల్లులు సకాలంలో అందక గతంలో పలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ కొత్త ఆన్‌లైన్ విధానం ద్వారా సకాలంలో చెల్లింపులు జరిగి, కార్మికుల సమస్యలు తొలగిపోతాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఈ నిర్ణయంపై కార్మికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో మరింత సమర్థతను, పారదర్శకతను తీసుకు వస్తుందని అధికారులు భావిస్తున్నారు.






