- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కందులు @ రూ.7,900.. ఓపెన్ మార్కెట్‌లో ధర అదుర్స్
రాష్ట్రంలో కందులకు మంచి ధర పలుకుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కందులకు మంచి ధర పలుకుతున్నది. ప్రభుత్వ మద్దతు ధర రూ. 7,500 ఉండగా, బహిరంగ మార్కెట్లో రూ. 7,900కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో వారికే విక్రయించడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ ధరలు ఇలాగే కొనసాగితే.. అప్పుల నుంచి కాస్త అయినా ఉపశమనం లభిస్తుందని రైతులు భావిస్తున్నారు. అయితే ప్రైవేటు వ్యాపారుల వద్ద నాణ్యత పేరుతో కోతలు, తూకంలో మోసాలు జరుగుతున్నాయని, రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
41 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు
కందుల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఎనిమిదో తేదీన 13 జిల్లాల పరిధిలో అన్ని సౌకర్యాలతో 41 సెంటర్లను ఏర్పాటు చేసింది. కందులు అమ్మిన పది రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నది. అయితే బహిరంగ మార్కెట్లో అధిక ధరలు వస్తుండడంతో రైతులు ప్రభుత్వం కేంద్రాలకు అంతగా రావడం లేదు. రాష్ట్రంలో ఈ ఏడాది 5.20 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయగా, 1.72 లక్షల మెట్రిక్టన్నుల దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 4,083 మంది రైతుల నుంచి 3200 మెట్రిక్ టన్నుల కందులు మాత్రమే విక్రయించారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ. 7,550 చెల్లిస్తున్నది. ఇప్పటివరకు మార్క్ ఫెడ్ ద్వారా రూ. 24 కోట్ల విలువైన కందులు సేకరించగా, వాటిలో నుంచి ఇప్పటి వరసకు రూ. 4.97 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. మిగతా సొమ్ము వారం రోజుల్లో పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు ప్రైవేటు వ్యాపారులు రూ. 7,900 వరకు చెల్లిస్తూ వెంటనే నగదు రైతుల చేతుల్లో పెడుతున్నారు. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రైతులు కందులు తీసుకురావడానికి ఆసక్తి కనబర్చడం లేదు. అయితే బహిరంగ మార్కెట్ లో వ్యాపారులు ఎక్కువ ధర పెట్టిన కందులు కొనుగోలు చేస్తున్నా.. నాణ్యతపై కొర్రీలు పెడుతూ తూకంలో భారీగా కోతలు విధిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తూకం విషయంలోనూ మోసాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని సూచిస్తున్నారు. కాగా, కందిపప్పుకు డిమాండ్ ఉండడం, ధరలు సైతం పెరుగుతుండడంతో పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలని కేంద్రం భావించింది. తెలంగాణలో 1,69,140 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు అనుమతించింది. రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరకు సరఫరా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.
జిల్లాల వారీగా కొనుగోళ్లు ఇలా
జిల్లా - - రైతులు - కందులు (మెట్రిక్ టన్నుల్లో)
ఆదిలాబాద్ - 741 - 602
గద్వాల్ - 1,392 - 1,229
కామారెడ్డి - 301 - 222
ఆసిఫాబాద్ - 26 - 9.40
మహబూబ్ నగర్ - 91 - 88.96
నాగర్ కర్నూల్ - 96 - 67.45
నారాయణపేట - 450 - 439
సంగారెడ్డి - 175 - 135.50
సిద్దిపేట - 716 - 346
వికారాబాద్ - 95 - 45






