హై వోల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్‌గా ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ యాక్షన్ ప్లాన్ ఏంటి?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-25 09:57:54  IST  )

రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ మిస్టరీ ఇప్పుడు హై వోల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. దీనికి తోడు సిట్ అధికారులు సిద్ధం చేసిన ‘ప్లాన్-బీ’ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

హై వోల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్‌గా ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ యాక్షన్ ప్లాన్ ఏంటి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ మిస్టరీ ఇప్పుడు హై వోల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. దీనికి తోడు సిట్ అధికారులు సిద్ధం చేసిన ‘ప్లాన్-బీ’ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కేవలం పోలీసు అధికారుల అరెస్టులు, విచారణలకు పరిమితమైన ఈ కేసు ఇప్పుడు రాజకీయ నాయకుల గడప తొక్కుతోంది. కేటీఆర్, హరీశ్ రావు వంటి కీలక నేతలకు 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. అందరికీ ఒకే విధమైన నోటీసులు ఇస్తున్నారా అనే చర్చ ప్రారంభమైంది. కేటీఆర్, హరీశ్ రావులను సాక్షులుగా పరిగణించి రికార్డు చేసిన స్టేట్మెంట్లను మిగతా స్టేట్మెంట్లతో కలిపి దర్యాప్తు చేయనున్నట్లు సిట్ చీఫ్ వెల్లడించారు. విచారణలో భాగంగా కేసుకు సంబంధించిన పరిపాలనా నిర్ణయాలు, నియామకాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై వారి వివరణలను నమోదు చేస్తున్నారని సమాచారం.

మార్చి 10లోపు కంప్లీట్ అయ్యేలా..

మరోవైపు ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు మార్చి 10 వరకు ఇంటెరిమ్ ప్రొటెక్షన్ లభించగా ఆ గడువులోపు విచారణను వేగవంతం చేసి కీలక అంశాలను పూర్తి చేయాలని సిట్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే మరికొంతమందికి సైతం 160 సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మాజీ ఎంపీ సంతోష్ రావు, మాజీ ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్తను విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది. వీరి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మరోసారి కేటీఆర్, హరీశ్ రావును విచారించనున్నట్లు సమాచారం.

అరెస్టులకు 160 సీఆర్‌పీసీ అస్త్రం

సాధారణంగా ఏ కేసులోనైనా సమాచారం తెలిసిన వారిని సాక్షులుగా పిలుస్తారు. ఇక్కడ కూడా ‘మీకు ఈ విషయాలు తెలుసా?’ అని అడిగే సాకుతోనే విచారణ మొదలవుతుంది. అధికారులు అడిగే ప్రశ్నలకు వారు ఇచ్చే సమాధానాలను రికార్డ్ చేస్తారు. ఒకవేళ విచారణలో పొంతన లేని సమాధానాలు వస్తే లేదా సాక్ష్యాధారాలు దొరికితే, సాక్షులుగా వచ్చిన వారు నిందితులుగా మారడానికి ఎంతో సమయం పట్టదని 160 సీఆర్‌పీసీ సెక్షన్ తెలుపుతుంది. నిందితుడిగా పేర్కొని నోటిసులు ఇస్తే కోర్టును ఆశ్రయించి ఇంటెరిమ్ ప్రొటెక్షన్ తెచ్చుకుంటారనే నేపంతో సిట్ 160 సీఆర్‌పీసీ అస్త్రం సంధిచినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు ఇచ్చే సమాచారం లేదా ఆయన పైన సిట్ చూపే ఆధారాలతో ఈ కేసులో మరికొన్ని అరెస్టులు జరగవచ్చని తెలుస్తుంది. 160 సీఆర్‌పీసీ గురించి తెలిసిన బీఆర్ఎస్ లీగల్ టీం సూచనలతోనే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్, హరీశ్ రావుల విచారణ సమయంలో ఆందోళనలకు దిగినట్లు తెలుస్తోంది.

సిట్ యాక్షన్ ప్లాన్

కీలక నేతలను సాక్షులుగా పిలిచి గంటల కొద్దీ విచారించడం

పాత రికార్డులు, ఫోన్ డేటాతో వారి స్టేట్‌మెంట్లను క్రాస్ చెక్ చేయడం

అవసరమైతే రెండోసారి సైతం విచారణకు పిలుస్తామని సమాచారం ఇవ్వడం

ప్రభాకర్ రావు రక్షణ గడువు ముగియగానే ఆయనను రప్పించి ఫైనల్ కన్ఫర్మేషన్ తీసుకోవడం

READ MORE ....

ఆ హోటల్ ఫోటోలు త్వరలోనే బయటపెడుతా.. భట్టి వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్

Next Story