ప్రతి ఉప ఎన్నికలోనూ ట్యాపింగ్

by Ajay Maddhiboyina |

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తులో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. 15 రోజులుగా నిర్విరామంగా సిట్ విచారణ కొనసాగుతోంది.

ప్రతి ఉప ఎన్నికలోనూ ట్యాపింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తులో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. 15 రోజులుగా నిర్విరామంగా సిట్ విచారణ కొనసాగుతోంది. 2018 ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్‌ జరిగినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. ప్రణీత్ రావు నుంచి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు ట్యాపింగ్ సమాచారం అందింది. ట్యాపింగ్ ద్వారానే ప్యారడైస్ వద్ద భవ్య సిమెంట్స్ అధినేత భవ్య ఆనంద్ ప్రసాద్‌కు చెందిన రూ.70 లక్షలు టాస్క్‌ఫోర్స్ టీమ్‌ సీజ్ చేసింది. ఆ సమయంలో శేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ తరఫున భవ్య ఆనంద్ ప్రసాద్ పోటీలో ఉన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్ జరిగినట్లు తెలిసింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందన్ రావు బంధువులకు చెందిన కోటి రూపాయలను రాధాకిషన్ రావు, అతని బృందం బేగంపేట పరిధిలో స్వాధీనం చేసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ప్రభాకర్ రావు ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ టీమ్ దాడులు నిర్వహించింది. శ్రీనాథ్ రెడ్డి అనే ఇన్‌స్పెక్టర్ ద్వారా గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెక్కీ నిర్వహించారు. నల్లగొండకు చెందిన కీలక కాంగ్రెస్ నేతల అనుచరులు గుంట సాయికుమార్ రెడ్డి, మహేశ్, వెన్నం భరత్‌లను అడ్డగించి వారి నుంచి రూ3.50 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

నా ఫోన్ ఎర్రబెల్లి ట్యాప్ చేయించాడు: కాంగ్రెస్ నేత బిల్లా సుధీర్ రెడ్డి

ప్రధాన అనుచరుడిగా పని చేసిన తననే మోసగిస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేయించాడని వరంగల్‌కు చెందిన కాంగ్రెస్ నేత సుధీర్ రెడ్డి ఆరోపించారు. ఎర్రబెల్లికి సంబంధించి పలు ప్రశ్నలతో సుధీర్ రెడ్డిని సిట్ విచారించినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారులకు ఫోన్ టాపింగ్‌పై సుధీర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి నుంచి సైతం సిట్ అధికారులు స్టేట్‌మెంట్ తీసుకున్నట్లు తెలుస్తున్నది.

తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లు ట్యాప్

తమ ఫోన్లు సైతం ట్యాప్ అయ్యాయని తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్య వేదిక, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక సిట్‌కు లేఖ రాసాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారని హరీశ్ రావు నివాసానికి పిలిపించి.. మీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారో మాకు తెలుసు.. అని బెదిరించారని రాష్ట్ర అధ్యక్షుడు రఘుమారెడ్డి తెలిపారు. నాగార్జున‌సాగర్ బై ఎలక్షన్స్‌లో 500 మందితో నామినేషన్ వేస్తే తనది, ఉద్యమకారుల ఫోన్లు ట్యాపింగ్ చేసి అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేటలో 200 చొప్పున నామినేషన్లు వేయడానికి నిర్ణయం తీసుకుంటే.. ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను నామినేషన్లు వేయకుండా భయపెట్టించారని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, వారి అనుచరులను అరెస్ట్ చేయాలని కోరారు.

Next Story