- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ముగింపునకు చేర్చింది. గత ఐదున్నర నెలలుగా అహర్నిశలు సాగిన విచారణలో సిట్ అధికారులు సంచలన నిజాలను వెలుగులోకి తెచ్చారు. ఈ కుట్రలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుతో పాటు పలువురు పోలీసు మాజీ అధికారులు, రాజకీయ నేతలపై పక్కా సాక్ష్యాలతో కూడిన తుది చార్జిషీట్ దాఖలు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. టెలికాం సంస్థల నుంచి సేకరించిన 618 ఫోన్ నంబర్ల డేటా, సుమారు 2,500కు పైగా ట్యాపింగ్ సంభాషణల ఆధారాలు, ఎఫ్ఎస్ఎల్ నివేదికలను ఈ చార్జిషీట్‌లో కీలకంగా పొందుపర్చనున్నట్టు సమాచారం.
బాధితుల వాంగ్మూలాల నమోదు వేగవంతం..
ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులుగా ఉన్న ప్రజాప్రతినిధుల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసే ప్రక్రియను సిట్ వేగవంతం చేసింది. శనివారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్‌ల వాంగ్మూలాలను అధికారులు సేకరించారు. సిట్ అధికారులు నేరుగా మంత్రి తుమ్మల నివాసానికే వెళ్లి దాదాపు గంటపాటు వివిధ అంశాలపై వివరాలు సేకరించారు. అనంతరం ఎంపీ అనిల్ కుమార్ బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విచారణకు హాజరయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరిద్దరి ఫోన్లు నిరంతరం ట్యాపింగ్‌కు గురైనట్లు సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిర్ధారించారు. మంత్రి తుమ్మలతో పాటు ఆయన ప్రధాన అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా అప్పట్లో నిఘాలో ఉంచినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
మరో ఇద్దరు మంత్రులకు నోటీసులు
ట్యాపింగ్ బాధితుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. మరో ఇద్దరు కీలక మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుల ఫోన్లు కూడా గత ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్‌కు గురైనట్లు సిట్ ఆధారాలు సేకరించింది. గత ఎన్నికల ముందు వీరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన తరుణంలో వీరి ప్రతి కదలికపై నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరి స్టేట్‌మెంట్లను కూడా సాక్ష్యాలుగా నమోదు చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వంటి కీలక నేతల స్టేట్‌మెంట్లను సిట్ రికార్డ్ చేసిన విషయం తెలిసిందే.
జర్నలిస్టుల స్వేచ్ఛపైనా..
రాజకీయ నేతలే కాకుండా, జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాప్ చేయడం సంచలనం కలిగిస్తోంది. హైదరాబాద్ సహా జిల్లాల్లో పనిచేస్తున్న సుమారు 28 మంది జర్నలిస్టుల ఫోన్లను పోలీసులు నిఘాలో ఉంచారు. ఇందులో కొంతమంది ఫోన్లను మావోయిస్టులు, టెర్రరిస్టుల సమాచారం కోసమని లీగల్ ఇంటర్‌సెప్ట్ పేరుతో ట్యాప్ చేయగా, మెజారిటీ జర్నలిస్టుల ఫోన్లను అనధికారికంగా హ్యాక్ చేసినట్లు సిట్ గుర్తించింది. తాజాగా సాక్షి పొలిటికల్ చీఫ్ రిపోర్టర్ కల్వల మల్లికార్జున్ రెడ్డిని అధికారులు విచారించారు. ఇప్పటికే ది హిందూ పొలిటికల్ ఎడిటర్ ఆర్.రవికాంత్ రెడ్డి కూడా విచారణకు హాజరై తన స్టేట్‌మెంట్ ఇచ్చారు.
న్యాయపరమైన చిక్కులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు
హైదరాబాద్ సీపీ నేతృత్వంలో సాగుతున్న ఈ విచారణలో ఎక్కడా న్యాయపరమైన లోపాలు లేకుండా సిట్ అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఎస్ఐబీ లాగర్ రూమ్‌లో ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌ల నుంచి పునరుద్ధరించిన డేటానే ఈ కేసులో కీలకమైన సాక్ష్యంగా మారనుంది. నిందితులకు శిక్ష పడేలా సాక్షులను, సాంకేతిక ఆధారాలను అనుసంధానం చేస్తూ చార్జిషీట్ సిద్ధం చేస్తున్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా నిందితులుగా ఉన్న మాజీ పోలీస్ ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి రావు, శ్రవణ్ రావుతో పాటు ప్రముఖ రాజకీయ నేతలపై పక్కా సాక్ష్యాలతో మరో రెండుమూడు వారాల్లో ఈ చార్జిషీట్ కోర్టు ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.






