- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం పరిశ్రమ సంఘాల అల్టిమేటం
రాష్ట్ర ప్రభుత్వానికి, మద్యం పరిశ్రమకు మధ్య బకాయిల సెగ రాజుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వానికి, మద్యం పరిశ్రమకు మధ్య బకాయిల సెగ రాజుకుంది. ఒకవైపు 5 నెలలుగా రావాల్సిన రూ.3,700 కోట్లకు పైగా బకాయిలు చెల్లించకుండానే.. మరోవైపు ప్రస్తుత సరఫరాలపై నగదు రాయితీ పేరిట ప్రభుత్వం కోతలు విధించడంపై కంపెనీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముందుగా పాత బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలని, ఆ తర్వాతే రాయితీ పథకాల గురించి ఆలోచించాలని పరిశ్రమ సంఘాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు ప్రముఖ మద్యం సంఘాలైన బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ సంయుక్తంగా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశాయి.
ఏమిటీ వివాదం..
తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ప్రభుత్వం మద్యం సరఫరాదారులకు 2025 డిసెంబర్ నుంచి చెల్లింపులు నిలిపివేసింది. డిసెంబర్ మొదటి వారం నుంచి 2026 ఏప్రిల్ వరకు సుమారు రూ.3,725.73 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. అయితే, జూన్ 1 నుంచి ప్రభుత్వం కొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. దీని ప్రకారం.. మే నెలలో సరఫరా చేసిన స్టాక్‌కు 15 రోజుల్లోపు బిల్లులు చెల్లిస్తామని, దానికి బదులుగా 2% నుంచి 2.75% వరకు నగదు రాయితీని ప్రభుత్వం మినహాయించుకుంటోంది. అంటే పాత బకాయిలు ఇవ్వకుండా, కొత్త బిల్లుల్లో కోతలు విధించడం పరిశ్రమను ఆందోళనకు గురిచేస్తోంది.
ఏకపక్ష నిర్ణయం..
సాధారణంగా వ్యాపార లావాదేవీల్లో నగదు రాయితీ అనేది సరఫరాదారు అంగీకారం లేదా అభ్యర్థన మేరకు ఉండాలి. కానీ, ప్రభుత్వం తన ఆధిపత్యం ఉపయోగించుకుని ఏకపక్షంగా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తోందని సంఘాలు ధ్వజమెత్తాయి. పాత బకాయిలు ఉండగా కొత్త వాటిని ముందుగా క్లియర్ చేయడం ప్రామాణిక అకౌంటింగ్ పద్ధతులకు విరుద్ధమని కంపెనీలు పేర్కొంటున్నాయి. ఇది ఆడిటర్ల తనిఖీల్లో ఇబ్బందులకు దారితీస్తుందని, కంపెనీల ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశాయి.
పాత పద్ధతిలోనే విడుదల చేయాలి
ప్రభుత్వం తన ఆర్థిక అవసరాల కోసం కొత్త బకాయిలను రాయితీతో క్లియర్ చేస్తూ, పాత బకాయిలను అటకెక్కించే ప్రమాదం ఉంది. కాలక్రమేణా ఈ రూ.3,700 కోట్లు వసూలు కాని బాకీలుగా మారితే పరిశ్రమ కుప్పకూలుతుందని ఐఎస్‌డబ్ల్యూఏఐ సీఈవో సంజిత్ పాధి, సీఐఏబీసీ డీజీ అనంత్ అయ్యర్, బీఏఐ డీజీ వినోద్ గిరి హెచ్చరించారు. చెల్లింపులు పాత పద్ధతిలోనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం మొండివైఖరి వీడాలి..
దేశంలోని మద్యం అమ్మకాల్లో 80 శాతం వాటా కలిగిన ఈ మూడు సంఘాలు ప్రభుత్వానికి పంపిన లేఖలో స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశాయి. స్వేచ్ఛా వాణిజ్య సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని, తక్షణమే పాత బకాయిలు విడుదల చేయాలని కోరాయి. మరి ఈ లేఖపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, మద్యం సరఫరాపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.






