- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘షాడో పీడీ’ పెత్తనంపై ఆరోపణలు.. ఏపీశాక్స్‌లో అసంతృప్తి
హెచ్‌ఐవీ నియంత్రణ కార్యక్రమాల అమలులో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఏపీ శాక్స్ లో పాలన గాడి తప్పింది.

దిశ, ఏపీ బ్యూరో : హెచ్‌ఐవీ నియంత్రణ కార్యక్రమాల అమలులో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఏపీ శాక్స్ లో పాలన గాడి తప్పింది. మానవ వనరుల నిర్వహణ, పదోన్నతులు, బదిలీలు, ఔట్‌సోర్సింగ్ విధానం, కీలక విభాగాల్లో ఇన్‌చార్జి పాలన, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత లోపం, సమాచార హక్కు చట్టం అమలు అస్తవ్యస్థంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమితులైన బచ్చు స్మరణ్ రాజ్ ఒకటి రెండు రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. సవాళ్లను అధిగమించి పాలనను గాడిలో పెట్టాల్సిన బాధ్యత కొత్త పీడీ పై ఉందనే వాదనలు వ్యక్తం అవుతున్నాయి.
‘షాడో పీడీ’ ఇష్టారాజ్యం
ఏపీ శాక్స్‌లో షాడో పీడీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. అధికారిక బాధ్యతలకు అతీతంగా ఒక అధికారి అన్ని విభాగాల వ్యవహారాల్లో తలదూర్చి సర్వం తానై వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. తనకు అనుకూలంగా పనిచేసే ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని ప్రధాన కార్యాలయంలో ఉద్యోగుల కదలికలు, కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తనకు సంబంధం లేని ఇతర విభాగాల వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోవడం, నిర్ణయాలపై ప్రభావం చూపడం, అధికారిక బాధ్యతలకు అతీతంగా ఆ అధికారి వ్యవహరించడంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
పైరవీలకే ప్రాధాన్యం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు అదే హోదాల్లో కొనసాగుతుండగా, కొందరికి మాత్రమే పదోన్నతులు దక్కడం సంస్థలో అంతర్గత చర్చకు దారితీసింది. అర్హత, అనుభవం, సీనియారిటీ కంటే పైరవీలకే ప్రాధాన్యం లభిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాల స్థాయిలో బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో కూడా స్పష్టమైన విధానం లేకపోవడం ఉద్యోగుల్లో అభద్రతాభావాన్ని పెంచుతోందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. పారదర్శకతతో కూడిన విధానాలను అమలు చేయాలని, సీనియారిటీ, అర్హత, సేవా అనుభవానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. దశాబ్దాలుగా సేవలందిస్తున్న అనేక మంది ఉద్యోగులు ఇప్పటికీ అదే హోదాలో కొనసాగుతుండగా, రాష్ట్ర విభజన అనంతరం చేరిన కొందరికి మాత్రం నిబంధనలను పక్కనబెట్టి పదోన్నతులు, బదిలీలు కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఒకే కుటుంబంలో మూడు పోస్ట్‌లు
ఒకే కుటుంబానికి చెందిన పలువురు సభ్యులు వివిధ హోదాల్లో కొనసాగుతుండటం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2015లో అప్పటి పీడీకి బంధువు గా చెప్పబడి డివిజనల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందిన ఒక ఉద్యోగి, ఇప్పుడు ఏకంగా అసిస్టెంట్ డైరెక్టర్ హోదాకి రావడం కొసమెరుపు. ఇంకా ట్వీస్ట్ ఏమంటే ఆమె తమ్ముడుకి ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఆమె భర్తకు ఒక పోస్ట్ ఇలా ఉద్యోగాలను పంచుకున్నారంటూ ఉద్యోగులు బాహాటంగా విమర్శిస్తున్నారు. .
ఇన్‌ఛార్జ్‌ల రాజ్యం.. ఆడిట్ లేని ఫైనాన్స్
శాక్స్‌లో కీలకమైన పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఫైనాన్స్, బేసిక్ సర్వీసెస్, సీఎస్టీ వంటి విభాగాల్లో పూర్తి స్థాయి అధికారుల కొరత కారణంగా ఇన్‌చార్జి వ్యవస్థ కొనసాగుతోందని సమాచారం. దీనివల్ల నిర్ణయాల్లో జాప్యం, సమన్వయ లోపం, బాధ్యతల విషయంలో స్పష్టత లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఫైనాన్స్ విభాగంలో కూడా పూర్తి స్థాయి పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఆర్థిక నిర్వహణపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా సమగ్ర ఆర్థిక ఆడిట్ జరగలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. బడ్జెట్ వినియోగం, కొనుగోళ్లు, రీయింబర్స్‌మెంట్లు, నియామకాలు, పదోన్నతులపై కొత్త ప్రాజెక్ట్ డైరెక్టర్ స్మరణ్ రాజ్ దృష్టి సారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అస్తవ్యస్థంగా మారిన ఏపీ శాక్స్‌ను కొత్త పీడీ ఎంతవరకు గాడిలో పెడతారో వేచి చూడాలి.






