- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జల సంరక్షణలో మణికొండ ‘అనూహర్’ అపార్ట్‌మెంట్ ఆదర్శం
గత ఏడాది నీటి ట్యాంకర్ల కోసం రూ.90 వేలు ఖర్చు చేసిన మణికొండ ‘అనూహర్’ అపార్ట్‌మెంట్ నివాసితులు.. వాన నీటితో పాటు ఆర్వో (RO) వృథా నీటిని ఇంకుడు గుంతలోకి మళ్లించి బోర్ బావులను రీఛార్జ్ చేసుకున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: వేసవిలో నగరవాసులకు నీటి ట్యాంకర్ల వేట మొదలవుతుంది. వేలాది రూపాయలు కుమ్మరించినా ట్యాంకర్లు దొరకని పరిస్థితి. సరిగ్గా గత ఏడాది మణికొండ రోడ్ నంబర్ 26లోని అల్కాపూర్ టౌన్‌షిప్‌లోని ‘అనూహర్ పర్పుల్ ట్యూన్స్’ అపార్ట్‌మెంట్‌వాసులు కూడా ఇలాంటి గడ్డుకాలాన్నే ఎదుర్కొన్నారు. కేవలం ట్యాంకర్ల కోసం ఏకంగా రూ.90 వేలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనుకున్న ఆ అపార్ట్‌మెంట్ నివాసితులు.. చేతులు ముడుచుకుని కూర్చోకుండా జల సంరక్షణ (Water conservation)కు నడుం బిగించారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మార్గదర్శకత్వంలో చేపట్టిన ‘ఇంటింటి ఇంకుడు గుంత’ ప్రయోగం ఇప్పుడు అద్భుత ఫలితాలు ఇస్తూ నగరంలోని మిగతా సొసైటీలకు ఆదర్శంగా నిలిచింది.
గత ఏడాది ఎదురైన నీటి ఎద్దడిని గుణపాఠంగా తీసుకున్న అపార్ట్‌మెంట్‌వాసులు శాశ్వత జల భద్రత వైపు అడుగులు వేశారు. జలమండలి వాటర్ హార్వెస్టింగ్ ఓఎస్టీ సత్యనారాయణను సంప్రదించి వారి సాంకేతిక సలహాలతో అపార్ట్‌మెంట్ ప్రాంగణంలోని బోర్‌వెల్ సమీపంలో ఒక శాస్త్రీయమైన వర్షపు నీటి నిల్వ (ఇంకుడు) గుంతను నిర్మించారు. అపార్ట్‌మెంట్ టెర్రస్‌పై పడే ప్రతి వర్షపు చుక్క వృథా కాకుండా, అన్ని పైపులను కేంద్రీకత వ్యవస్థ ద్వారా అనుసంధానించి నేరుగా ఈ ఇంకుడు గుంతలోకి మళ్లించారు. దీనివల్ల వర్షపు నీరంతా భూమిలోకి ఇంకి, భూగర్భ జల మట్టం పెరగడానికి బలమైన పునాది పడింది.
బోరు బావులకు జలకళ..
కొద్ది నెలలకే వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈ వినూత్న ప్రయత్నానికి తొలి ఫలితం దక్కింది. కురిసిన ప్రతి వర్షపు నీరు ఇంకుడు గుంత ద్వారా భూగర్భంలోకి చేరి, అడుగంటిన బోర్‌వెల్‌ను రీఛార్జ్ చేయడం ప్రారంభించింది. అంతకుముందు ఎండిపోయే స్థితికి చేరిన బోర్లలో నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వచ్చింది. సమష్టి కృషితో ప్రకృతి ప్రసాదించిన వాన నీటిని ఒడిసి పట్టడం వల్ల భూగర్భ జలాలు ఎంత వేగంగా పునరుజ్జీవం పొందుతాయో ఈ ప్రయోగం కండ్లకు కట్టినట్లు నిరూపించింది.
ఆర్వో వృథా నీటితో..
తొలి ప్రయత్నం విజయవంతం కావడంతో అపార్ట్‌మెంట్‌వాసులు మరో వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. సాధారణంగా ప్రతి ఫ్లాట్‌లో వాడే వాటర్ ప్యూరిఫైర్ల నుంచి సగానికిపైగా నీరు వృథాగా బయటకు పోతుంటుంది. ఈ ఏడాది ఆ వృథా నీటిని డ్రైనేజీ పాలు చేయకుండా, అపార్ట్‌మెంట్‌లోని అన్ని ఫ్లాట్ల ఆర్వో అవుట్‌లెట్ పైపులను ఒకే లైనుకు అనుసంధానించి ఇంకుడు గుంతకు కనెక్ట్ చేశారు. దీనివల్ల ఇళ్లలో శుద్ధి ప్రక్రియ జరిగినంతసేపు ఆ వృథా నీరు నిరంతరాయంగా భూమిలోకి ఇంకుతూ 24 గంటలూ భూగర్భ జలాల రీఛార్జ్ ప్రక్రియకు ఊతాన్ని ఇస్తోంది.
రెండున్నర నెలలుగా ’జీరో’ ట్యాంకర్స్..
ఈ రెండు వినూత్న ప్రయోగాల కలయికతో అపార్ట్‌మెంట్ జలవనరుల రూపురేఖలే మారిపోయాయి. వర్షపు నీరు, ఆర్వో వ్యర్థ జలాల నిరంతర రీఛార్జ్ కారణంగా ఎండిపోయే దశకు చేరిన అపార్ట్‌మెంట్ బోరుబావి మళ్లీ జలకళను సంతరించుకున్నది. దీని ఫలితంగా, రెండున్నర నెలలుగా ఈ అపార్ట్‌మెంట్‌వాసులు ఒక్క నీటి ట్యాంకర్ కూడా బుక్ చేయాల్సిన అవసరం రాలేదు. ప్రతి నెలా అయ్యే వేల రూపాయల మెయింటెనెన్స్ ఖర్చు మిగలడమే కాకుండా, అపార్ట్‌మెంట్ కమ్యూనిటీకి దీర్ఘకాలిక జల భద్రత లభించింది. పర్యావరణహితమైన ఈ విధానం ద్వారా అటు అపార్ట్‌మెంట్ నివాసితులకు ఆర్థిక ఊరట, ఇటు భూమాతకు జల సంరక్షణ చేకూరాయి. చిన్నపాటి సమాజ భాగస్వామ్యం, సరైన ప్రణాళిక ఉంటే ఎంతటి నీటి సంక్షోభాన్ని అయినా ఎదుర్కోవచ్చని ఈ విజయం నిరూపించింది. ‘ఈ రోజు మనం నీటిని కాపాడితే, రేపు ఆ నీరు మనల్ని కాపాడుతుంది‘ అనే సందేశాన్ని ‘అనుహర్ పర్పుల్ ట్యూన్స్’ వాసులు బలంగా చాటుతున్నారు.
ఇంకుడు గుంతలు తప్పనిసరి..
‘నగరంలో భూగర్భ జలాల సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. ప్రతి ఇల్లు, ప్రతి అపార్ట్‌మెంట్‌లో ఇంకుడు గుంతల నిర్మాణం లేకపోతే రాబోయే రోజుల్లో నీటి చుక్క కోసం అల్లాడక తప్పదు. పర్యావరణ హితమైన, శాశ్వత నీటి భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలను చేపట్టాలి. ఇంకుడు గుంతలు ప్రతి ఇల్లు, అపార్ట్‌మెంట్‌లో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి’ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. నగరంలో ఈ ఏడాది మే, జూన్ నెలల్లో సుమారు 12 వేల అపార్ట్‌మెంట్లలో బోర్‌వెల్స్ ఎండిపోయాయని తెలిపారు.
హైదరాబాద్ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున భూగర్భ జలాల క్షీణత నమోదవడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ప్రతి భవనంలో వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టకపోతే వచ్చే ఏడాది వేసవిలో భూగర్భ జలాల కొరత మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. భవిష్యత్ తరాలకు తగిన నీటి భద్రత కల్పించాలంటే ప్రతి పౌరుడు వర్షపు నీటి సంరక్షణలో భాగస్వామి కావాలని ఆయన కోరారు.- జలమండలి ఎండీ అశోక్ రెడ్డి






