క్లైమ్యాక్స్‌కు చేరిన ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఫైనల్ చార్జిషీట్ సిద్ధం!

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-07 01:40:39  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంది. రెండు సంవత్సరాలుగా సేకరించిన ఆధారాలతో కూడిన ఫైనల్ చార్జిషీట్‌ను సిట్ సిద్ధం చేస్తోంది.

క్లైమ్యాక్స్‌కు చేరిన ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఫైనల్ చార్జిషీట్ సిద్ధం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంది. రెండు సంవత్సరాలుగా సేకరించిన ఆధారాలతో కూడిన ఫైనల్ చార్జిషీట్‌ను సిట్ సిద్ధం చేస్తోంది. మరో రెండు వారాల్లో ఈ చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేయనుండగా ఆ వెంటనే కొందరి అరెస్టులు జరగనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల స్టేట్మెంట్లు దర్యాప్తులో కీలకంగా మారగా.. బీఆర్ఎస్ నేతలలో మొదటి అరెస్ట్ మాజీ ఎంపి సంతోష్ రావుదేననే ఉహాగానాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అధికార యంత్రాంగంకు ఫోన్ ట్యాపింగ్‌కు నెంబర్ల చేరవేత, ట్యాపింగ్ అమలు విధానం వంటి అంశాలపై సిట్ లోతుగా విచారణ జరపగా ఇందులో సంతోష్ రావు ప్రమేయం ప్రధానంగా ఉన్నట్లు సిట్ నిర్ధారించినట్లు సమాచారం.

కేసీఆర్ ఓఎస్డీదే కీలకం

ఈ కేసులో కీలక పాత్రధారిగా భావిస్తున్న కేసీఆర్‌ ఓఎస్డీ రమణారెడ్డి స్టేట్మెంట్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రమణారెడ్డి ఇచ్చిన వివరాలు కేసు దిశను ప్రభావితం చేసినట్లు తెలిసింది. ట్యాపింగ్ వ్యవహారంలో నిర్ణయాలు, సమాచారం అందజేత, బాధ్యతల కేటాయింపు వంటి అంశాలపై సిట్ స్పష్టమైన ఆధారాలు సేకరించినట్లు సమాచారం. కాగా రమణారెడ్డి, ప్రభాకర్‌రావుల విచారణ ఆధారంగానే బీఆర్ఎస్ కీలక నేతలకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు, హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావును, కేసీఆర్‌లను అధికారులు విచారించారు. హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావును దాదాపు 8గంటల పాటు విచారించి స్టేట్మెంట్ రికార్డు చేయగా.. కేసీఆర్‌‌ను 5గంటల పాటు విచారించి స్టేట్మెంట్ తీసుకున్నారు.

హరీష్‌రావుకు షాక్

జనవరి 20న హరీష్ రావును విచారించగా ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు అధికారులు కొన్ని ఆధారాలు చూపించారు. దీంతో హరీష్ రావు సైతం షాక్‌ అయ్యారని వార్తలొచ్చాయి. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావులు ఇచ్చిన సమాచారంతో హరీష్ రావు స్టేట్మెంట్‌ను సిట్ సరిపోల్చి చూశారు. ఈ పరిణామాల తరువాత సిట్ దర్యాప్తు దిశలో మార్పులు వచ్చాయని, ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకునే దశకు కేసు చేరుకుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో కీలక నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావును సీఐగా డిమోట్ చేస్తూ చర్యలు తీసుకోగా.. ఫైనల్ చార్జ్‌షీట్ దాఖలుతో కేసు న్యాయపరమైన దశలోకి ప్రవేశిస్తే రాజకీయంగా కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎవరెవరిపై ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారనే అంశం ఇప్పుడు రాష్ట్రరాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

సామ్రాట్‌‌కు నోటీసులు

ఈ కేసులో సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం తెలుగు స్ర్కైబ్ మాజీ అడ్మిన్ సామ్రాట్‌కి ఫోన్ పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకి, సామ్రాట్‌కు మధ్య నేరుగా సంభాషణ జరిగినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. కాగా ఈ కేసుకు సంబంధించిన మరికొన్ని నిజాలు సామ్రాట్‌కి తెలిసే ఉంటుందని, అందుకే విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Next Story