ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంకోర్టులో హరీశ్‌రావుకు బిగ్ రిలీఫ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-05 06:18:48  IST  )

మాజీ మంత్రి హరీశ్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంకోర్టులో హరీశ్‌రావుకు బిగ్ రిలీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)ను విచారించేందుకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న (BV Nagaratna), జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ (Ujjal Bhuyan)లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అనంతరం తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)ను కూడా కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. కోర్టు తాజా తీర్పుతో ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు భారీ ఊరట లభించినట్లైంది.

హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు..

కాగా, డిసెంబర్ 2024లో సిద్దిపేట (Siddipet)కు చెందిన వ్యాపారి గంధగోని చక్రధర్ గౌడ్ (Gandhgoni Chakradhar Goud) గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు అప్పటి పోలీసు అధికారులు తన ఫోన్‌ను అక్రమంగా ట్యాప్ చేశారని, తనను మానసికంగా వేధించి భయభ్రాంతులకు గురిచేశారని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హరీశ్ రావుపై ఎఫ్‌ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. అయితే, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆయన తెలంగాణ హైకోర్టు (Telangana High Court)ను ఆశ్రయించారు. దీంతో ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, కేసులో తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ 2025 మార్చి 20న ఆ కేసును కొట్టివేసింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున, మాజీ మంత్రి హరీశ్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించగా.. ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టి పిటిషన్‌ను కొట్టివేసింది.

Next Story