- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజల గొంతుకగా పిటిషన్స్ కమిటీ.. నిబంధనల ప్రకారమే పిటిషన్ల స్వీకరణ: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ శాసనసభ, శాసన మండలిలో పెండింగ్‌లో ఉన్న అన్ని కమిటీలను ఏర్పాటు చేశామని, అధికార-ప్రతిపక్షం అనే తారతమ్యం లేకుండా సభలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ శాసనసభ, శాసన మండలిలో పెండింగ్‌లో ఉన్న అన్ని కమిటీలను ఏర్పాటు చేశామని, అధికార-ప్రతిపక్షం అనే తారతమ్యం లేకుండా సభలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్ర శాసన మండలి పిటిషన్స్ కమిటీ తొలి సమావేశం సోమవారం శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగింది. ఈ సమావేశానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్, పిటిషన్స్ కమిటీ చైర్మన్ బండ ప్రకాష్‌తో పాటు కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ప్రజలు సమర్పించే పిటిషన్లు శాసనసభ నిబంధనలు, లెజిస్లేచర్ నమూనా ప్రకారమే ఉండాలని, అలా సమర్పించిన పిటిషన్లనే కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టం చేశారు. శాసనసభ కమిటీల్లో సభ్యత్వం దక్కడం ఒక అదృష్టమని, కమిటీల్లో చురుకుగా పని చేయడం ద్వారా ప్రజా సమస్యలపై అవగాహనతో పాటు విలువైన అనుభవం కూడా లభిస్తుందని పేర్కొన్నారు. తాను గతంలో అసెంబ్లీ లైబ్రరీ కమిటీలో సభ్యుడిగా పనిచేసిన అనుభవమే తన రాజకీయ ప్రస్థానానికి ఎంతో ఉపయోగపడిందని గుర్తుచేశారు.
ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది: మండలి చైర్మన్
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, పిటిషన్స్ కమిటీ ప్రజల గొంతుకగా పనిచేసే కీలక వేదిక అని అన్నారు. కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా కృషి చేస్తే ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పారు. భవిష్యత్తులో పిటిషన్లు పెండింగ్‌లో లేకుండా పక్కా కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. పిటిషన్స్ కమిటీ చైర్మన్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ, తెలంగాణ శాసన మండలి పిటిషన్స్ కమిటీ చైర్మన్‌గా పనిచేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. కమిటీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పిటిషన్స్ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీలు కోదండరాం, దాసోజు శ్రవణ్ కుమార్, రెహ్మత్ బేగ్, దామోదర్ రెడ్డి, రాష్ట్ర శాసన మండలి కార్యదర్శి నరసింహాచార్యులు, శాసనసభ కార్యదర్శి ఆర్. తిరుపతి తదితరులు పాల్గొన్నారు.






