బాస్మతి ఎగుమతులకు ‘పెస్టిసైడ్’ అడ్డంకి.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-10 16:46:28  IST  )

బాస్మతి ఎగుమతులకు ‘పెస్టిసైడ్’ అడ్డంకి మారుతుందని వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, అభిప్రాయం వ్యక్తం చేశారు.

బాస్మతి ఎగుమతులకు ‘పెస్టిసైడ్’ అడ్డంకి.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం
X

దిశ, తెలంగాణ బ్యూరో: బాస్మతి ఎగుమతులకు ‘పెస్టిసైడ్’ అడ్డంకి మారుతుందని వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, అభిప్రాయం వ్యక్తం చేశారు. రూ.50 వేల కోట్ల విలువైన బాస్మతి ఎగుమతి వ్యాపారం తీవ్రమైన సవాలును ఎదుర్కొంటోందని, ‘బయోఆగ్రి-2025’ సదస్సులో నిపుణులు హెచ్చరించారు. దిగుమతి చేసుకునే దేశాలైన యూరోపియన్ యూనియన్ (EU), జపాన్, ఇరాన్, క్లీన్ రైస్ (పెస్టిసైడ్ అవశేషాలు లేని బియ్యం) కోసం పట్టుబడుతున్నాయని పేర్కొన్నారు. బయో అగ్రీ ఇన్‌పుట్ ప్రోడ్యూసర్స్ అసోషియేషన్ (బీపా) ఆధ్వర్యంలో ‘బయో ఆగ్రి-2025’ సదస్సు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సీటీలో బుధవారం నిర్వహించారు. ఈ సదస్సులో, వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు కీలకమైన అంశాలపై చర్చించారు.

ఈ సదస్సులో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సాగర్ హనుమాన్ సింగ్ మాట్లాడుతూ.. ఈయూ వంటి దేశాల మార్కెట్లు పురుగు మందుల గరిష్ట అవశేష పరిమితులను అత్యంత కనిష్ట స్థాయికి తగ్గించాయని తెలిపారు. దీని ఫలితంగా భారతీయ బియ్యం తిరస్కరణలు 2020లో 3 శాతం నుంచి 2024 నాటికి 37శాతంకు పెరిగాయి అన్నారు. ఇది ఎగుమతిదారులకు పెను ప్రమాదంగా మారిందని తెలిపారు. అంతర్జాతీయ డిమాండ్‌తో పాటు, దేశంలోని 300-400 మిలియన్ల మధ్యతరగతి వినియోగదారులు కూడా ఇప్పుడు అవశేషాలు లేని ఆహారాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత నిపుణుడు ప్రొఫెసర్ ఎంఎస్ రెడ్డి మాట్లాడుతూ.. జీవ వ్యవసాయం ఇకపై ప్రత్యామ్నాయం కాదని.. దేశ తదుపరి వ్యవసాయ విప్లవానికి అత్యవసరమని పేర్కొన్నారు. వ్యవసాయంలో జీవ సంబంధమైన మార్పు అనివార్యమని అభిప్రాయపడ్డారు. పార్క్‌లు ఖాళీగా ఉన్నాయని, ఆసుపత్రులు నిండి ఉన్నాయని డాక్టర్ బకుల్ జోషి వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో కావేరీ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వి.ప్రవీణ్ రావు, బిపా అధ్యక్షుడు డాక్టర్ జాన్ పీటర్ పాల్గొన్నారు. ‘న్యూట్రింగ్ నేచర్’, ‘నౌరోషింగ్ ది ఫ్యూచర్’ అనే థీమ్‌లతో జరుగుతున్న రెండు రోజుల పాటు జరిగే సదస్సులో 200 మందికి పైగా ప్రతినిధులు, 40కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేయబడ్డాయి.

Next Story