కాలేజీకి పది నిముషాల్లోనే పర్మిషన్ !

by velandi.Saikiran |   (  Updated:2025-07-06 15:25:40  IST  )

కాలేజీకి పది నిముషాల్లోనే పర్మిషన్ !
X

కాలేజీకి పది నిముషాల్లోనే పర్మిషన్

కాలేజీ పర్మిషన్ లని కామెడీగా మార్చేసిన ఫార్మా కౌన్సిల్ ఛైర్మన్..

13 రోజుల్లో 870 ఫార్మా కాలేజీలకు ఫటాఫట్ అనుమతులు..

చెకింగ్ లన్నీ జూమ్ కాల్ లోనే..

5400 కోట్ల భారీ స్కామ్ బట్టబయలు..

సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు

దిశ తెలంగాణ బ్యూరో: కీలకమైన ఫార్మా చదువులని అందించే కాలేజీలకు అనుమతుల విషయంలో భారీ కుంభకోణం బయటపడింది.2023-24 మధ్యకాలంలో భారతదేశం అంతటా దాదాపు 870 ఫార్మసీ కళాశాలలు కేవలం 13 రోజుల్లోనే ఎలా అనుమతులు పొందాయనే విషయంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది, లోతుకి వెళ్తున్నా కొద్దీ పలు అక్రమాలు బయటపడుతుండటంతో ,

'కుంభకోణం'కి కేంద్ర బిందువుగా ఉన్న కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ మోంటు కుమార్ పటేల్ ని అరెస్ట్ చేసే పనిలో పడింది. అయితే పటేల్ దేశం విడిచి కెనడా పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమాచారం అందుకున్న సి.బి.ఐ అన్ని ఎయిర్ పోర్ట్ లలో లుక్ అవుట్ నోటీస్ జారీ చేసినట్టు సమాచారం.

జూమ్ లో అనుమతులు.. కోట్లల్లో ముడుపులు..

నిజానికి ఇతర వైద్య కళాశాలల్లాగే ఫార్మసీ కాలేజీల అనుమతుల విధానం కఠినంగా ఉంటుంది. గ్రౌండ్ లెవల్ లో అసలు అన్ని సౌకర్యాలను కాలేజీ కల్పించిందా,లేదా అనే విషయం పూర్తిగా భౌతిక తనిఖీల తర్వాతే నిర్ణయించాలి.కానీ చాలా వరకు కాలేజీలకు కేవలం జూమ్ కాల్స్ ద్వారా పర్మిషన్స్ ఇచ్చినట్టు ..అదికూడా 7 నుండి 8 నిమిషాల వ్యవధిలోనే ఒక్కో జూమ్ కాల్స్ ద్వారా ఒక్కో కాలేజీ కి అనుమతులు ఇచ్చారని సిబిఐ అధికారులు గుర్తించారు. ఛైర్మన్ వ్యవహార శైలిపై పలు ఫిర్యాదులు అందుకున్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిఘా వేయగా అక్రమాలు నిజమేనని తెలియడంతో ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ జరిగినట్లు తెలుస్తోంది. "మొదట కొత్త కళాశాలలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఒక సర్క్యులర్ జారీ చేసారనీ.. ఆ తరువాత ఓ జూమ్ కాల్ పెట్టి ఎక్కడికక్కడ కాలేజీలకు అనుమతులు ఇచ్చారని గుర్తించింది.

సిబిఐ దర్యాప్తులో సంచలన అంశాలు..

సిబిఐ దాఖలు చేసిన అభియోగ పత్రం ప్రకారం కనీసం భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు, సిబ్బంది చివరికి విద్యార్థులు కూడా లేరని భావిస్తున్న అనేక కళాశాలలకు ఫార్మా కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ పటేల్, అతని సహాయకులు అనుమతులిచ్చేసారు. అసలు తనిఖీలు కానీ , దానికై సమర్పించిన వీడియో ఆధారాలు, సంబంధిత పత్రాలు కానీ ఏవీ లేవు దర్యాప్తులో అప్పటికే నెగిటివ్ రిమార్క్ ఉన్న కనీసం ఆరు కళాశాలలకు ఆమోదం లభించిందని తేలింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లోని 23 కళాశాలలను సిబిఐ బృందాలు విచారించి ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నాయి.

కేసుల నమోదుతో ఊపందుకున్న దర్యాప్తు..

జూన్ 30న సిబిఐ డాక్టర్ మోంటు కుమార్ పటేల్ , ఇతరులపై ఐపిసి సెక్షన్లు 120-బి (నేరపూరిత కుట్ర) 420 (మోసం) అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కుమార్ పిసిఐ అధ్యక్ష ఎన్నికల్లో గెలవడానికి గానూ..వచ్చిన ఓటర్లకు ఆతిథ్యం ఇవ్వడానికి న్యూఢిల్లీలోని ఒక హోటల్‌లో రూ.2.7 లక్షల విలువైన గదులను బుక్ చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. గెలిచిన తర్వాత, కీలకమైన కౌన్సిల్ పదవులకు సహాయకులను నియమించడం ద్వారా తనకు సంబంధించిన వ్యక్తులను ఎంచుకోవడానికి , తద్వారా విస్తృత అధికారాలను చేతిలో ఉంచుకొని, అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారని సిబిఐ దర్యాప్తు పత్రం తెలిపింది. చివరకు అవినీతి మరకలతో 5400 కోట్ల భారీ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా చట్టం ముందు నిలబడే పరిస్ధితి తెచ్చుకున్నాడనే చర్చ జరుగుతోంది.

Next Story