మూసీ పునరుజ్జీవనానికి ప్రజల జై.. 70 గ్రామాలకు రూ.వెయ్యి కోట్లు కోరిన ప్రజాసంఘాలు

by Ramesh Naini |

మూసీ పునరుజ్జీవం మంత్రుల సబ్ కమిటీకి మూసీ పరిరక్షణ సమితి, మూసీ పరివాహక గ్రామాల సమాఖ్య ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు.

మూసీ పునరుజ్జీవనానికి ప్రజల జై.. 70 గ్రామాలకు రూ.వెయ్యి కోట్లు కోరిన ప్రజాసంఘాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘మూడు దశాబ్దాలుగా మూసీ నది నీరు విషపూరితం కావడంవల్ల మా బతుకులు ధ్వంసమయ్యాయి. జంటనగరాల లోంచి వచ్చే డ్రెయినేజీ నీటితో పాటు, పరిశ్రమల నుంచి వచ్చే రసాయనాలు వ్యర్థాలతో కూడిన నీరు మా జీవితాలను, మా పశువులను, మా గొర్రెలు, మా మత్స్య సంపద, మా పంటను, మా తాటి, ఈత కల్లును, మా సర్వస్వాన్ని నాశనం చేశాయి. రెండు దశాబ్దాలలో దాదాపు వంద మందికి పైగా స్త్రీలకు గర్భవిచ్ఛిన్నం జరిగింది. పశువులు కూడా సరిగా సంతానం ఉత్పత్తి చేయలేకపోయాయి. శిశువులకు స్నానం చేయించడానికి ప్రైవేట్ RO ప్లాంట్ నుండి, నీటిని ఖరీదు చేసి వాడుతున్న దుస్థితి నెలకొని ఉంది. అయితే మూసీ నదిలోని కాలుష్యాన్ని అంతా శుద్ధి చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం మా గ్రాములకు శుద్ధి చేసిన నీరు నది ద్వారా అందించేందుకు సన్నాహాలు చేస్తుందని తెలిసి మేమంతా చాలా సంతోషిస్తూ, ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాం’ అని మూసీ పరివాహక గ్రామాల ప్రజలు పేర్కొన్నారు. ఈ మేరకు మూసీ పునరుజ్జీవం మంత్రుల సబ్ కమిటీకి మూసీ పరిరక్షణ సమితి, మూసీ పరివాహక గ్రామాల సమాఖ్య ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. సబ్ కమిటికి ఆన్ లైన్ ద్వారా వినతి పత్రం పంపించిన వారిలో మానవ హక్కుల వేదిక నాయకులు జీవన్ కుమార్ మూసీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బట్టె శంకర్, గౌడ సంఘం నాయకులు బాలరాజ్ గౌడ్, యాదవ సంఘం నాయకులు చిలువేరి ఐలయ్య, శాలివాహన సంఘం నాయకులు గుండోళ్ళ లింగ స్వామి, ముదిరాజ్ సంఘం నాయకులు పూలమోని బస్వ య్య, ఎంఆర్పీఎస్ నాయకులు సిరిపని ఐలయ్య, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు మల్యాల బాలయ్య తదితరులు ఉన్నారు.

అందులోని ముఖ్య అంశాలు

*మూసీ ప్రాజెక్టు పై అభిప్రాయాలు స్వీకరించే మంత్రుల కమిటీ మా గ్రామాలు పర్యటించి, మా అభి ప్రాయాలు స్వీకరించాలి.

*ఈ ప్రాజెక్ట్ లో పరివాహక గ్రామాల ప్రజలను కూడా భాగస్వాములను చేయాలి.

*గౌరెల్లి గ్రామం వరకే ప్రకటించిన ప్రాజెక్టును, సోలిపేట గ్రామం, కేతేపల్లి మండలం, సూర్యపేట జిల్లా వరకు పొడిగించాలి.

*మూసీ దిగువన ఉన్న దాదాపు 70 గ్రామాలకు రూ.1000 కోట్లు కేటాయించాలి. ఈ వెయ్యి కోట్లు మూడు దశాబ్దాలుగా మా గ్రామ ప్రజల జీవితాలు విధ్వంసం అయినందుకు, మా సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం కోసమే.

*అన్ని గ్రామాల్లో RO ప్లాంట్స్ ఏర్పాటు చేసి వాటిని గ్రామపంచాయితీల అజమాయిషీలో ఉంచాలి.

*ఏదులాబాద్ చెరువులో 2 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. దాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు కృషి చేయాలి.

Next Story