లోపలికి పోను.. భయమేస్తోంది! గురుకుల పరీక్ష కేంద్రం వద్ద చిన్నారుల మారం.. తర్వాత ఏమైంది?

by Ramesh Naini |   (  Updated:2025-02-23 08:46:53  IST  )

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 6వ తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఆదివారం ప్రవేశ పరీక్షలు నిర్వహించారు.

లోపలికి పోను.. భయమేస్తోంది! గురుకుల పరీక్ష కేంద్రం వద్ద చిన్నారుల మారం.. తర్వాత ఏమైంది?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 6వ తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఆదివారం ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. గంట ముందే పరీక్ష కేంద్రానికి విద్యార్థులు చేరుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్దకు వచ్చిన కొంతమంది చిన్నారులు గేటు వద్ద మారం చేశారు. దీంతో తల్లిదండ్రులు వారిని బుజ్జగించి పరీక్షలు రాయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నాకు భయం వేస్తోంది పరీక్షకు పోను అని పరీక్షా కేంద్రం వద్ద మారం చేసిన బాలుడిని పోలీసులు బుజ్జగించి ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రంలోకి పంపారు.

హన్మకొండలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సి పాఠశాల పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసేందుకు తండ్రితో వచ్చిన ఓ విద్యార్థి నేను లోపలికి పోను నాకు భయం వేస్తోందని మారం చేశాడు. బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పరీక్షా కేంద్రానికి అప్పడే వచ్చిన హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి, అక్కడే విధులు నిర్వహిస్తున్న కేయూసీ ఇన్స్ స్పెక్టర్ రవికుమార్ ఆ విద్యార్థిని చూసి బుజ్జగించి ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రంలోకి పంపించారు. అదేవిధంగా పరీక్ష కేంద్రం వద్ద పలువురు చిన్నారులకు పోలీసులు ధైర్యం చెప్పి లోపలికి పంపించారు. చిన్నారులు పరీక్ష రాసేందుకు పోలీసులు చూపిన చొరవ పరీక్షా కేంద్రం వద్ద ఉన్న విద్యార్థుల తల్లిదండ్రుల మనస్సుల్లో పోలీసులపై గౌరవం మరింత పెరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Next Story