పెన్షనర్ల సమస్యలు పరిష్కరించండి.. ప్రభుత్వ పెన్షన్ దారుల ఐకాస డిమాండ్

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, వారితో ప్రత్యేకంగా చర్చించాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ దారుల సంయుక్త కార్యాచరణ సమితి ప్రభుత్వాన్ని కోరింది.

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించండి.. ప్రభుత్వ పెన్షన్ దారుల ఐకాస డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, వారితో ప్రత్యేకంగా చర్చించాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ దారుల సంయుక్త కార్యాచరణ సమితి ప్రభుత్వాన్ని కోరింది. సీఎం, డిప్యూటీ సీఎం, సీఎస్‌లకు ఎన్నిసార్లు లేఖలు రాసినా, అపాయింట్మెంట్ కోరినా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఐదు నిమిషాలు మాట్లాడేందుకు కూడా నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో కె.లక్ష్మయ్య అధ్యక్షతన తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమిటీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రధాన సమస్యలు, ప్రభుత్వ వైఖరిపై చర్చించారు. ఇటీవల కేబినేట్ సబ్ కమిటీ, అధికారుల కమిటీ జరిపిన చర్చల్లో పెన్షనర్లకు సంబంధించిన సమస్యలు చేర్చినప్పటికీ ఏ ఒక్కటీ పరిష్కరించలేదని, ఆర్థికేతర అంశాలను కూడా పట్టించుకోలేదన్నారు.

రాష్ట్రంలో మూడు లక్షల మంది పెన్షనర్లను గాలికొదిలేశారన్నారు. గత ఎన్నికల సందర్భంగా మద్దతు పలికి గెలిపించినా ఫలితం లేకుండా పోయిందని నాయకులు ఆరోపించారు. చట్ట ప్రకారం రావాల్సినవి, ప్రభుత్వం వద్ద పెండింగులో పెడుతూ వచ్చినవి మాత్రమే త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నగరరహిత చికిత్సకు తమ వంతుగా నెలకు రూ.500 ఇస్తామన్నా అతీగతీ లేదన్నారు. మెడికల్ బిల్లులు చెల్లించడం లేదని, నెలకు రూ.800 కోట్లు విడుదల చేసి పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం రూ.180 కోట్లు మాత్రమే రిలీజ్ చేసిందన్నారు. పెన్షనర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే తామంతా విసిగిపోయామని, తమ సమస్యలు పరిష్కరించకపోతే త్వరలోనే కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. సమావేశంలో చైర్మన్ కె.లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ, కోర్ కమిటీ సభ్యులు శుభాకర్​రావు, సూర్యనారాయణ, భరత్ రెడ్డి, పుల్లయ్య, తడకమళ్ల వివేక్, జనార్ధన్ భట్, జ్ఞానేశ్వర్, నరసరాజు, ఆర్ధిక కార్యదర్శి కృష్ణప్రసాద్ ఉన్నారు.

Next Story