- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోట్లల్లో పెండింగ్ కేసులు.. కదలని న్యాయచక్రం!
దేశవ్యాప్తంగా కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య 5.5 కోట్లకు చేరింది. సుప్రీంకోర్టులో 92 వేలు, తెలంగాణ హైకోర్టులో 2.36 లక్షల కేసులు పరిష్కారానికి నోచుకోలేదని కేంద్రం వెల్లడించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కోర్టుకు వెళ్తే ఏళ్ల తరబడి తిరగాల్సిందేనన్న మాట నిజమే అనిపిస్తున్నది. ఇప్పుట్లో కేసులు తెగేలా లేవన్న అభిప్రాయం ప్రజల్లో పాతుకుపోయింది. దేశంలోని వివిధ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసుల పరిస్థితిని పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతున్నది. దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో 63,95,572 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అలాగే కిందిస్థాయి కోర్టుల్లో 4,86,33,521 కేసులు పరిష్కారం కావాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వివరాలను మార్చి 27న పార్లమెంట్‌కు తెలిపింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారీగా దిగువ స్థాయి కోర్టుల్లో అధిక సంఖ్యలో ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయని, ఇక్కడ 1.19కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు ప్రకటించింది. హైకోర్టుల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా అలహాబాద్హైకోర్టులో 12.26 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. కాగా, దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో 92,782 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణ హైకోర్టులో 2,36,629 కేసులు పరిష్కారానిక నోచకుండా ఉన్నాయి. అయితే ప్రజల్లో చైతన్యం, చట్టం, కోర్టులపై నమ్మకం పెరగడం, న్యాయవిద్యపై అవగాహన రావడంతో కోర్టుల్లో కేసుల నమోదు పెరుగుతున్నది. కోర్టుల్లో వాయిదాల పర్వం సుదీర్ఘంగా కొనసాగుతుందని, ఇలా ఒక్కో కేసు ఏళ్ల తరబడి నడుస్తున్నదని, అందుకే పెండింగ్‌కేసుల సంఖ్య పెరుగుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
కేసుల పరిష్కారానికి ప్రణాళిక
కోర్టుల్లో పెండింగ్‌కేసుల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సహా రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలను చేపట్టాయి. తాలూకా, జిల్లా కోర్టుల్లో వసతి సౌకర్యాలు పెంచారు. కేంద్ర ప్రభుత్వం 2023-27 వరకు దేశవ్యాప్తంగా కోర్టులను ఆధునీకరించడానికి రూ.7,210 కోట్లు ఖర్చు కేటాయించింది. కోర్టులను ఆధునిక టెక్నాలజీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్కోసం ఈ నిధులను వినియోగిస్తున్నారు. దేశంలో కోర్టులను పేపర్లెస్కోర్టులుగా, డిజిటల్కోర్టులుగా మార్చడానికి పూనుకుంది. తద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని అంచనా వేశారు. ఏ కేసు ఎక్కడ పెండింగ్ఉంది. ఏ స్థాయిలో ఉందనే విషయాలను ఈజీగా తెలుసుకోవడం ద్వారా అనుమానాలు, అపోహలు, తప్పుడు సమాచారానికి చెక్పెట్టొచ్చనే ఉద్దేశంతో రూపకల్పన చేశారు.
కోర్టుల డిజిటలైజేషన్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 660 కోట్ల పేజీల కోర్టు రికార్డులను డిజిటలైజ్చేశారు. 2,444 ఈఎస్కేలను ఏర్పాటు చేశారు. కోర్టులు కొంతకాలంగా 3.97 కోట్ల హియరింగ్స్‌ను వీడియోకాన్ఫరెన్స్‌ద్వారా విన్నారు. 1.07 కోట్ల కేసులను ఈ ఫైలింగ్విధానంలో ఫైల్‌చేశారు. కోర్టులతో పాటు కేసుల సత్వర పరిష్కారానికి పలు ప్రత్నామ్నాలు సూచించింది. మెగా లోక్‌అదాలత్‌లో పాటు తాలుకా, జిల్లా, రాష్ట్రస్థాయిలో లోక్‌అదాలత్‌లను నిర్వహిస్తున్నారు. పారిశ్రామికవేత్తల కేసుల పరిష్కారానికి పలు సంస్కరణలు తీసుకొచ్చారు. జడ్జి పోస్టులను ఎప్పటికప్పడు భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు.
జడ్జీ పోస్టులు భర్తీ
2014 -26 ఫిబ్రవరి వరకు 72 మంది సుప్రీంకోర్టు జడ్జీలను, 1,164 కొత్త జడ్జీలను, 820 అడిషనల్జడ్జీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీచేశారు. 2014 మే నెలలో 906 హైకోర్టు జడ్జి పోస్టులు ఉండగా ఇప్పుడు 1,122కు చేరాయి. ఫిబ్రవరి చివరి నాటికి జ్యూడీషియల్ఇన్ఫ్రాస్ట్రక్చర్కోసం కేంద్రం రూ.770 కోట్లు కేటాయించింది. ఇందులో ఇప్పటివరకు రూ.630కోట్లు ఖర్చు చేశారు. కేసులు పెండింగ్‌లో ఉండటంతో ప్రజలకు సత్వరన్యాయం దొరక్కపోవడంతో ఆర్థికంగా ప్రజలు నష్టపోతున్నారని, తద్వారా ప్రజలపై ఆర్థిక భారం సైతం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల కేసుల్లో కేసులు వేసినవారు చనిపోయిన సందర్భాలూ ఉన్నాయని, అయినా అప్పటి వరకు తీర్పులు రావడం లేదని చెబుతున్నారు. సత్వరం ఫలితం, తీర్పులు వచ్చే విధంగా ప్రజలకు నమ్మకం కలిగించాలని కోరుతున్నారు.






