CM Revanth Reddy: సీఎంతో ముగిసిన పీసీసీ చీఫ్ భేటీ.. బీసీ రిజర్వేషన్ల అమలుపై కీలక నిర్ణయం

by Ramesh Naini |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ భేటీ ముగిసింది.

CM Revanth Reddy: సీఎంతో ముగిసిన పీసీసీ చీఫ్ భేటీ.. బీసీ రిజర్వేషన్ల అమలుపై కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) భేటీ ముగిసింది. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో గంటన్నరకు పైగా సమావేశం సాగింది. ఈ భేటీలో నేతలు కీలక అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ముఖ్యంగా 42% రిజర్వేషన్ల అమలు కోసం తదుపరి చేయవలసిన కార్యాచరణపై చర్చలు జరిగినట్లు తెలిసింది. అందులో భాగంగా ఈ నెల 16 లేదా 17 తేదీల్లో టీపీసీసీ పీఏసీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ పీఏసీ సమావేశంలో మెజారిటీ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని 42 శాతం బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని నాయకులు అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.

అలాగే బోర్డు, కార్పొరేషన్ డైరెక్టర్‌ల పోస్టల నియామకాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన అంశాలు, వ్యూహాల గురించి కూడా చర్చించినట్లు తెలిసింది. ఇటీవల చేపట్టిన జనహిత పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల పరిష్కారాలపై చర్చించినట్లు తెలిసింది. ప్రజా పాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువెళ్లాలనే అంశాలపైన చర్చలు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.

Next Story