నేను ఏమీ ఆశించడం లేదు కానీ.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం కొండగట్టులో పర్యటించారు.

నేను ఏమీ ఆశించడం లేదు కానీ.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: “తెలంగాణ ప్రజలకు కొత్త నాయకత్వం కావాలి. పంచాయతీల నుంచి మన అభివృద్ధి ప్రస్థానం మొదలుపెడదాం. సర్పంచులు, వార్డు మెంబర్లుగా విజయం సాధించి.. మీరంతా చాలా పెద్ద అడుగు వేశారు. ఎంత పెద్ద ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే మొదలు పెడతాం. ఈ రోజు మీరు వేసిన అడుగు సరికొత్త మార్పుకు నాంది కావాలని కోరుకుంటున్నాను” అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పష్టం చేశారు. పోటీ చేసిన సంఖ్యలో 50 శాతం విజయం సాధించడం అభినందనీయమన్నారు. జనసేన పార్టీ మద్దతుదారులుగా విజయం సాధించిన ప్రతి ఒక్కరూ మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. శనివారం కొండగట్టు పర్యటనలో భాగంగా ఇటీవల తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున సర్పంచులు, వార్డు మెంబర్లుగా విజయం సాధించిన అభ్యర్థులు, బరిలోకి దిగిన అభ్యర్థులతో సమావేశమయ్యారు. పార్టీ నుంచి గెలుపొందిన ప్రతి అభ్యర్ధికి పేరు పేరునా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున విజయం సాధించారు. మీరు మొదలుపెట్టిన ప్రయాణం కీలకమైనది. నేను పార్టీ పెట్టడానికి నాలో చైతన్యం నింపింది, నాకు ధైర్యం ఇచ్చింది తెలంగాణ నేల. నాకు తెలంగాణ పోరాట స్ఫూర్తి అంటే చాలా ఇష్టం. నేను ఇక్కడి నుంచి ఏమీ ఆశించడం లేదు. మన దేశం, మన తెలుగు నేలకు జనసేన పార్టీ తరఫున చేయగలిగిన సేవ కలసికట్టుగా చేద్దాం. తెలంగాణలో పుట్టిన పార్టీ మనది. ఇక్కడ ప్రజలకు అండగా నిలుద్దాం.

తెలుగు ప్రజల ఐక్యత కోసం కలిసి పని చేద్దాం

తెలంగాణకు బలమైన యువ నాయకత్వం అవసరం ఉంది. మీ స్థాయి, మీ ప్రాంతాన్ని బట్టి పోరాటం చేయండి. మీరంతా సైద్ధాంతిక బలంతో సహజంగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఒక సిద్ధాంతం ఆధారంగా ఎదిగిన వారిని విభేదించడం కష్టం. అది నేను ప్రాక్టికల్‌గా చేసి చూపాను. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు విభిన్నంగా ఉంటాయి. తెలంగాణ నేల నాకు పోరాట శక్తి ఇచ్చింది. రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకున్నాను అంటే తెలంగాణ అమరవీరులు ఇచ్చిన స్ఫూర్తే కారణం. రజాకార్ల మీద వారు చేసిన సుదీర్ఘ పోరాటం నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను. సమయం ఇవ్వగలిగితే రాజకీయాల్లో మంచి స్థాయికి చేరుకోవచ్చు. 53 మంది విజయం సాధించారు. దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో దక్కిన విజయం ఇది. మీ అందరికీ ఆ కొండగట్టు ఆంజనేయస్వామి ఆశీస్సులు ఉండాలి. అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలూ క్షేమంగా ఉండాలి. తెలుగు రాష్ట్రాల ప్రజల ఐక్యత కోసం కలసి పనిచేద్దాం” అన్నారు.

Next Story