మే 28న పాస్‌పోర్ట్ సేవలు బంద్: హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం ప్రకటన

by Ramesh Naini |

బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) పండుగ ప్రభుత్వ సెలవు దినం సందర్భంగా, మే 28వ తేదీన (గురువారం) పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులో ఉండవని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం తెలిపింది.

మే 28న పాస్‌పోర్ట్ సేవలు బంద్: హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) పండుగ ప్రభుత్వ సెలవు దినం సందర్భంగా, మే 28వ తేదీన (గురువారం) పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులో ఉండవని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం తెలిపింది. ఈ మేరకు డిప్యూటీ పాస్‌పోర్ట్ ఆఫీసర్ ఐ. శ్రీనివాసరావు మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ సెలవు దినం మే 27వ తేదీ నుంచి మే 28కి మారడంతో, హైదరాబాద్ రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీస్ పరిధిలోని ప్రధాన పాస్‌పోర్ట్ కార్యాలయం, అన్ని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (PSKs), పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (POPSKs) మే 28న మూసివేయబడతాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే, మే 27వ తేదీన (బుధవారం) ఈ కార్యాలయాలన్నీ తెరిచే ఉంటాయని, సేవలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.

అపాయింట్‌మెంట్‌ల తేదీ మార్పు..

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మే 28న పాస్‌పోర్ట్ సేవల కోసం అపాయింట్‌మెంట్‌ బుక్ చేసుకున్న దరఖాస్తుదారులందరికీ, ఆ స్లాట్‌లను మే 27వ తేదీకి (బుధవారం) రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కొత్త అపాయింట్‌మెంట్ తేదీ, సమయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని దరఖాస్తుదారుల మొబైల్ నంబర్లకు మెసేజ్‌ల (SMS) ద్వారా ఇప్పటికే తెలియజేశామని శ్రీనివాసరావు తెలిపారు. దరఖాస్తుదారులు ఈ మార్పును గమనించి, సవరించిన తేదీలో కార్యాలయాలకు హాజరు కావాలని ఆయన సూచించారు.

Next Story