Maoist Party: 'ప్రజా వంచన' పాలనపై ఉద్యమించండి.. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో సంచలన లేఖ

by Prasad Jukanti |   (  Updated:2025-12-07 08:36:57  IST  )

వికసిత్ భారత్ పేరుతో కార్పొరేట్ మనువాద ఆర్ఎస్ఎస్- బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.

Maoist Party: ప్రజా వంచన పాలనపై ఉద్యమించండి.. మావోయిస్టు అధికార ప్రతినిధి  జగన్ పేరుతో సంచలన లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: వికసిత్ భారత్ పేరుతో కార్పొరేట్ మనువాద ఆర్ఎస్ఎస్- బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని మావోయిస్టు పార్టీ (Maoist Party) పిలుపునిచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లు రద్దు కోసం ఈనెల 26న ప్రతిపక్షాలు నిర్వహించ తలపెట్టిన అఖిల భారత నిరసన కార్యక్రమాల్లో వేలాదిగా పాల్గొని పోరాడాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్టు) తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతో (Jagan Letter) తాజాగా ఓ లేఖ విడుదల చేసింది. బిహార్ ఎన్నికల అనంతరం శ్రమ నీతి-2025 పేరుతో కేంద్రం నాలుగు కార్మిక కోడ్లను (Labor Codes) అమల్లోకి తీసుకువచ్చిందని ఇవి రాజ్యాంగంలోని 14,16,23 ఆర్టికల్స్ ను ఉల్లంఘించడమేనని ఈ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర కార్మిక ఉద్యమాన్ని బలహీనపరచి, విచ్ఛిన్నం చేసేందుకే మనువాదులు ఈ కోడ్ లను తెచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతునన్న పార్లమెంట్ సమావేశాల్లో అణుశక్తి బిల్లు-2025 ద్వారా అణుశక్తి ఉత్పాదనను, పంపకాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పబోతున్నారని ఆదివాసీ, దళిత, వెనుకబడిన వర్గాల, అగ్రకులాల్లోని పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందకుండా చేసేందుకు యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‍సీఈఆర్‍టీలను రద్దు చేసి విద్యా కమిషన్ ను (హిందూస్థాన్ ఎడ్యుకేషన్ కమీషన్) ఏర్పాటు చేయబోతున్నారని ఆరోపించారు. ఎలక్ట్రిసిటీ బిల్లు ద్వారా విద్యుత్ ను పూర్తిగా ప్రైవేట్ పరం చేయడం, బ్యాంకుల విలీన చేసి వాటిని కార్పొరేట్ కంపెనీలకు ధారదత్తం చేయబోతున్నారని లేఖలో పేర్కొన్నారు.

ఆందోళనలను కఠినంగా అణచివేసేలా ఆదేశాలు:

గత నెల 28, 29, 30 తేదీలలో రాయ్‌పూర్‌లో మోడీ, అమిత్ షా నాయకత్వాన రాయ్‍పూర్‍లో నిర్వహించిన డీజీపీలు, పారామిలటరీ దళాల అధిపతుల సమావేశంలో పోలీస్ వ్యవస్థలను బలోపేతం చేసి, కార్పొరేట్ శక్తుల 'వికసిత భారత్' నిర్మాణానికి అడ్డు తగలకుండా ప్రజల, పౌర సమాజం, రాజకీయ పార్టీల నుండి వచ్చే ఆందోళనలను కఠినంగా అణచివేయాలని నిర్ణయాలు తీసుకున్నారని ఈ లేఖలో జగన్ గుర్తు చేశారు. ఈ పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇది ప్రజల రాజ్యాంగ హక్కులను కాలరాసే చర్యగా అభివర్ణించారు. మోడీ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల సంపద పెరుగుతుంటే ప్రభుత్వ అప్పులు పెరుగుతున్నాయని ఆరోపించారు.

ప్రతిపక్ష పార్టీలలో నిరాశలోకి నెట్టే ప్రయత్నం:

ప్రస్తుత పాలనలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పేరు చెప్పుకుంటూ RSS ఎజెండాను చట్టాలుగా అమలు చేస్తున్నారని, దీని వల్ల దళిత, ఆదివాసీ, బహుజనుల, ప్రగతిశీల శక్తులపై దాడులు తీవ్రతరం అవుతున్నాయని జగన్ పేర్కొన్నారు. ఇటీవల వెలువడిన బిహార్ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక 'ఫార్స్' అని నిరూపించాయని, ఎలక్షన్ కమీషన్, కోర్టులు, CBI, NIA వంటి అన్ని సంస్థలు బీజేపీ నియంత్రణలోకి వెళ్లిపోయాయని విమర్శించారు. త్వరలోనే 130వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రతిపక్షాల ముఖ్యమంత్రులు, మంత్రులను తొలగించే కార్యక్రమం కూడా చేయవచ్చని పేర్కొన్నారు. బిహార్ లో ఎస్ఐఆర్ ద్వారా ఎన్డీయే అధికారంలో గెలుపొందారని, హర్యానా, మహారాష్ట్రలో ఎస్ఐఆర్ జరపకుండా గెలుపొంది తాము ఏ విధింగానేనా కూడా గెలుస్తామని నిరూపిస్తున్నారని తద్వారా ప్రతిపక్ష పార్టీలలో నిరాశను తీసుకువచ్చి విచ్ఛిన్న చేసే విధంగా వారి ధోరణి ఉందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పెట్టుబడి, మార్కెట్ శక్తుల చేతుల్లో బందీ అయిందని విదేశీ మదుపరులు షేర్ మార్కెట్ లోని తమ పెట్టుబడులను విదేశాలకు తరలించుకుపోవడం, ట్రంప్ మన ఎగుమతుల మీద భారీగా సుంకాలు విధించడం వల్ల రుపాయి విలువ మరింత పతనమైందని పేర్కొన్నారు. దీని వల్ల ఇంధనం, వంట నూనె, ఎల్ పీజీ ధరలు పెరిగి పేద మధ్యతరగతి వర్గం మీద భరించలేని భారం పడనుందని పేర్కొన్నారు.

తెలంగాణ పత్తి రైతులకు నష్టం:

మోడీ ప్రభుత్వం ట్రంప్ కు లొంగిపోయి అమెరికా నుంచి పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ పంటలతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. దీన్ని వల్ల తెలంగాణ పత్తి రైతాంగం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన ధరల ప్రకారం కూడా పత్తి కొనుగోళ్లు సీసీఐ చేపట్టడం లేదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీ మీద ఒత్తిడి తెచ్చి అదానీ కంపెనీల్లో 45 వేల కోట్ల రూపాయల షేర్లను కొనిపించిందని ఈ విధంగా దేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు కార్పొరేట్ల కంట్రోల్ లోకి పోతుంటే మరో వైపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆదివాసీ, దళిత, పేద కులాల ప్రజల మీద దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కులవ్యవస్థ భారత దేశంలో ప్రగతిశీల పాత్ర పోషించిందని మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ ను కూడా దాఖలు చేసిందని విమర్శించారు.

ఐఏఎస్, ఐపీఎస్ లను లొంగతీసుకుంటున్నారు:

మోడీ ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్, క్లాస్ -1 అధికారులను లొంగతీసుకుని తమ ఎజెండాను అమలు చేయిస్తున్నారని జగన్ ఆరోపించారు. మాట వినని అధికారులను అవినీతి ఆరోపణలు, ఇతర కారణాలు చెప్పి ఈ 11 ఏళ్లలో 1500లకు పైగా అధికారులను సర్వీస్ నుంచి తొలగించారని మరెంతో మంది అధికారులపై కేసులు పెట్టారని ఆరోపించారు. హర్యాణా కేడర్ కు చెందిన దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య ఈ పరిస్థితులకు ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇంతటి ప్రమాదకర పరిస్థితులు ఉన్న కారణంగా కార్మికులు, రైతాంగం, విద్యార్థులు, మేధావులు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, రచయితలు, కాళాకాలు, జర్నలిస్టులు, సంఘాలు, అన్ని పార్టీలు ఈ ఆధునిక మనువాదులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

Next Story