పార్లమెంట్ ఎలక్షన్స్.. స్టేట్ చీఫ్ విషయంలో బీజేపీ కీలక నిర్ణయం!

by Sathputhe Rajesh |
పార్లమెంట్ ఎలక్షన్స్.. స్టేట్ చీఫ్ విషయంలో బీజేపీ కీలక నిర్ణయం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డినే కొనసాగించాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఆయన నాయకత్వంలోనే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతున్నది. కొత్త అధ్యక్షుడిని నియమిస్తే కుదురుకోవడానికి సమయం పడుతుందని, దీంతో ఇబ్బందులు రావొచ్చని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని పార్టీ హైకమాండ్ రాష్ట్ర నాయకత్వానికి సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది.

టార్గెట్.. 10 పార్లమెంట్ స్థానాలు..

గత పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయ పార్టీ 4 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈసారి కనీసం పది స్థానాల్లోనైనా గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. ఈ ఎన్నికల్లో ప్రచారానికి ఎలాంటి అస్త్రాలను సంధించాలనే వ్యూహాలపైనా కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చిన రీజనల్ రింగ్ రోడ్డు, రైల్వే, రోడ్ల అభివృద్ధిని జనాల్లోకి తీసుకువెళ్లాని భావిస్తున్నట్లు తెలిసింది. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు చెబుతున్నారు. డిసెంబర్ 16 నుంచి జనవరి 15 వరకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరిట జనాలకు చేరువ కావాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేలా..

రాష్ట్ర నేతల మధ్య ఆధిపత్య పోరుకు చెక్ పెట్టడంపైనా బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టిసారించింది. అందుకే సౌమ్యుడిగా ముద్రపడిన కిషన్ రెడ్డినే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న అధిష్టానం సౌత్‌లో ఎక్కువ మొత్తంలో పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడంపై ప్రణాళికలు రచిస్తున్నది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లకే పరిమితమైన బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలని పార్టీ భావిస్తున్నది.

Advertisement

Next Story