- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పారాక్వాట్ గడ్డిమందును నిషేదించాలి : హైదరాబాద్ డిక్లరేషన్ ప్రకటించిన IMA
పారాక్వాట్ గడ్డిమందును తక్షణమే రాష్ట్రంలో నిషేధించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ విభాగం డిమాండ్ చేసింది.

- టీజీఐఎంఏ హైదరాబాద్ డిక్లరేషన్ లో అఖిలపక్ష నేతల ఏకగ్రీవ తీర్మానం
- గడ్డి మందు సైనైడ్ కంటే ప్రమాదకరం: వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రాణాంతకమైన పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందును రాష్ట్రంలో తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం 'హైదరాబాద్ డిక్లరేషన్'ను ప్రకటించింది. సామాజిక బాధ్యతతో రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీల ప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చి ఈ విషపూరిత రసాయనంపై ఒకే గళంతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి. కిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ రంగానికి చెందిన ప్రముఖులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, వరంగల్ ఎంపీ కడియం కావ్య, రాజ్యసభ సభ్యులు బి. సురేష్ రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు. వీరంతా మాట్లాడుతూ
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పారాక్వాట్ మందును నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీ, పార్లమెంట్ వేదికలపై లేవనెత్తుతామని హామీ ఇచ్చారు. వైద్య నిపుణులు, బాధితుల గోడు విన్న తర్వాత సమావేశం పలు కీలక అంశాలను వెల్లడించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 70 కి పైగా దేశాలు ఈ మందును నిషేదించాయని పేర్కొంది.
ప్రభుత్వాలకు విన్నపం
మన దేశంలో ఇప్పటికే కేరళ, ఒడిశా రాష్ట్రాలు పారాక్వాట్‌ను నిషేధించిన విషయాన్ని గుర్తు చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డి తమకున్న విశేషాధికారాలను ఉపయోగించి రాష్ట్రంలో తక్షణమే నిషేధం విధించాలని తీర్మానించారు. అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఈ మందును నిషేధించాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
గడ్డి మందు సైనైడ్ కంటే ప్రమాదకరం: వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య
ఇది రైతులకు మాత్రమే కాకుండా రానున్న తరాలకు కూడా ముప్పుగా మారింది. గడ్డి మందు భూమి సారాన్ని నాశనం చేస్తోంది. ప్రజలకు తెలియక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రెండు మూడు చుక్కలు శరీరంలోకి వెళ్తేనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. గడ్డి మందును పూర్తిగా నిషేధించే వరకు నా పోరాటం కొనసాగుతుంది.






