Sarpanch Elections: తెలంగాణలో ముగిసిన సర్పంచ్ ఎన్నికల సమరం

by Prasad Jukanti |

తెలంగాణ గ్రామీణ రాజకీయ ముఖచిత్రంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

Sarpanch Elections: తెలంగాణలో ముగిసిన సర్పంచ్ ఎన్నికల సమరం
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది. మొత్తం మూడు దశల్లో పోలింగ్ జరుగగా ఇవాళ తుది దశ పూర్తయి ఇప్పటికే ఫలితాలు వెల్లడవుతున్నాయి. మొదటి రెండు దశల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగగా చివరి దశలోనూ అదే ట్రెండ్ కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగలబోతోందని ప్రతిపక్షాలు వేసిన అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. వాస్తవంలో ఫలితాలు హస్తం పార్టీకి అనుకూలంగా వచ్చాయి. ఇవాళ మూడో విడతలో సాయంత్రం 6:17నిమిషాల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 1,147 విజయం సాధించగా బీఆర్ఎస్ నుంచి 519, బీజేపీ 97, ఇతరులు 246 మంది అభ్యర్థులు గెలిచారు. ఇక ఫస్ట్, సెకండ్ ఫేజ్ ఫలితాల్లోనూ గ్రామీణ ఓటర్లు అధికార పక్షానికే పట్టంకట్టారు. మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులలో 2,331 మంది, బీఆర్ఎస్ నుంచి 1,168, బీజేపీ 189, ఇతరులు 539 మంది అభ్యర్థులు విజయం సాధించగా, రెండో దశలో కాంగ్రెస్ మద్దతుదారులు 2,245 మంది, బీఆర్ఎస్ 1,188, బీజేపీ 268, ఇతరులు 624 మంది గెలుపొందారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నది.

మూడో దశలో ఉత్కంఠ ఫలితాలు..

చివరి విడత ఫలితాల్లో పలుచోట్ల అభ్యర్థులు స్వల్ప తేడా విజయం సాధించారు. భద్రాద్రి జిల్లాలోని గాంధీ‌నగర్‌లో కాంగ్రెస్ బలపరిచిన బానోతు మంగీలాల్ 3 ఓట్ల తేడాతో గెలవగా, నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ మండలం నాగారంలో కాంగ్రెస్ మద్దతుదారు దౌల్తాపూర్ గీత కేవలం 7 ఓట్ల తేడాతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. కామారెడ్డి జిల్లా జగన్నాథపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వెంకయ్య 8 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

జగన్‌పై చంద్రబాబు విజయం!..

థర్డ్ ఫేజ్ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామంలో ఆసక్తికర పోటీ జరిగింది. సర్పంచ్ పదవి కోసం భూక్యా చంద్రబాబు, బానోత్‌ జగన్నాథం అలియాస్‌ జగన్‌ పోటీపడ్డారు. ఇద్దరూ కాంగ్రెస్‌లోని ఇరు వర్గీయుల మద్దతుతో బరిలో దిగగా వీరి పేర్ల కారణంగా అక్కడ ప్రచారం సైతం ఆసక్తిగా మారింది. ఇవాళ జరిగిన పోలింగ్‌లో భూక్యా చంద్రబాబు విజయం సాధించారు. దీంతో జగన్‌పై చంద్రబాబు విజయం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌ అవుతున్నాయి.

Next Story