వనపర్తిలో చరిత్రను వెలికితీసిన శిల్పాలు.. పాన్ గల్ ఖిల్లా వద్ద అరుదైన పులివేట వీరగల్లు

by Bhanu |

పాన్‌గల్ ఖిల్లా అంటే చరిత్రలతో ముడిపడిన శక్తివంతమైన గాథలే గుర్తుకు వస్తాయి. ఈ దుర్గం వద్ద కనిపించే పులివేట, పందివేట వీరగల్లులు ప్రాంతం ప్రత్యేక ఆకర్షణ.

వనపర్తిలో చరిత్రను వెలికితీసిన శిల్పాలు.. పాన్ గల్ ఖిల్లా వద్ద అరుదైన పులివేట వీరగల్లు
X

దిశ, పాన్‌గల్: పాన్‌గల్ ఖిల్లా అంటే చరిత్రలతో ముడిపడిన శక్తివంతమైన గాథలే గుర్తుకు వస్తాయి. ఈ దుర్గం వద్ద కనిపించే పులివేట, పందివేట వీరగల్లులు ప్రాంతం ప్రత్యేక ఆకర్షణ. పులులు, అడవి పందుల నుంచి ప్రజలను కాపాడిన వీరుల సాహసాన్ని గుర్తుచేసే వీరగల్లులు, ఊరి పొలిమేరల్లో ప్రజల అభిమానానికి నిదర్శనంగా నిలిచాయి.

వనపర్తి జిల్లా కేంద్రానికి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఖిల్లాలో అనేక విభిన్నమైన శిల్పాలు, శస్త్రాయుధాలు, ఫిరంగులు, మరియు రాయిపై చెక్కబడిన వీరగల్లులు కనిపిస్తాయి. ఈ కోటలోని ముళ్ళగవిని వద్ద తాజాగా గుర్తించబడిన పులివేట వీరగల్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు నాలుగు అడుగుల ఎత్తు గల ఈ శిల్పాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన పరిశోధకులు బైరోజు చంద్రశేఖర్, డాక్టర్ బైరోజు శ్యాంసుందర్ గుర్తించారు.





ఈ శిల్పంలో కుడివైపు సిగ, తలపై పాగా, మెడలో కంటె, వీరకాసె ధరించి ఉన్న వీరుడు తన రెండు చేతుల్లో బల్లెంతో పులిని చంపుతున్న అరుదైన దృశ్యం కనిపిస్తుంది. ఇది 13వ నుంచి 14వ శతాబ్దపు శిల్పకళను ప్రతిబింబిస్తుంది. ఇలాంటి మరో పులివేట వీరగల్లు ఇదే మండలంలోని బుసిరెడ్డిపల్లిలో కూడా ఉంది. ఈ రకమైన శిల్పాలు తెలంగాణలో నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, భువనగిరి, నిర్మల్ జిల్లాల్లో గుర్తించబడ్డాయి.

ఇప్పుడు వనపర్తి జిల్లాలో ఈ అరుదైన శిల్పం బయటపడటం ఇక్కడి స్థానిక వీరుల శౌర్యాన్ని ఘనతపరిచే విషయంగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ శిల్పాలను రక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలని, లేదా మ్యూజియంలో ఉంచాలని కొత్త తెలంగాణ చరిత్ర బృంద కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, ప్రజల తరపున ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అలాగే, పాన్‌గల్ ఖిల్లా‌ను పర్యాటక కేంద్రముగా అభివృద్ధి చేస్తే, ప్రాంతీయ అభివృద్ధికి దోహదం చేస్తుందన్న ఆశాభావాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు ప్రత్యేకంగా దృష్టి సారించి ఖిల్లాను పర్యాటక ప్రాజెక్టుగా గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు.



Next Story