పాక్ ఇజ్రాయెల్‌కు తమ్ముడి లాంటిది.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాకిస్తాన్, అలాగే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

పాక్ ఇజ్రాయెల్‌కు తమ్ముడి లాంటిది.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాకిస్తాన్, అలాగే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మక్కా మసీదులో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పాక్ ఇజ్రాయెల్‌కు తమ్ముడి లాంటిది’ అంటూ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ బాంబుల దాడి చేసి 400 మంది అమాయకులను చంపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ రెండు దేశాలు తమ పొరుగు వారిని ప్రశాంతంగా ఉండనివ్వవని మండిపడ్డారు. పాకిస్తాన్‌కు ఇస్లాం ప్రాథమిక సూత్రాలే తెలియవని, అమాయకుల ప్రాణాలు తీయడం దారుణమని ఆయన ఎద్దేవా చేశారు.

గంగా నదిలో ఇఫ్తార్ విందు కేసుపై స్పందన

పశ్చిమ ఆసియా విషయంలో గతంలో భారత్ అనుసరించిన తటస్థ వైఖరిని ప్రధాని మోడీ పక్కన పెట్టారని ఒవైసీ ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌లతో మోడీ పెంచుకున్న అతి సాన్నిహిత్యం వల్ల భారత్ తన పట్టు కోల్పోయిందని ఆయన విమర్శించారు. పశ్చిమ ఆసియా దేశాల్లో దాదాపు ఒక కోటి మంది భారతీయులు ఉపాధి పొందుతున్నారని, భారత్‌కు వచ్చే విదేశీ మార్పిడిలో 50 శాతం వారి నుంచే వస్తుందని ఆయన గుర్తుచేశారు. ఒకవేళ యుద్ధం వల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిని భారతీయులు తిరిగి వస్తే, మోడీ వారికి ఉపాధి కల్పిస్తారా? అని ప్రశ్నించారు. దేశంలో చమురు నిల్వలపై కూడా ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం 90 రోజులకు సరిపడా నిల్వలు ఉండాలని, కానీ భారత్ వద్ద కేవలం 9.50 రోజులకు సరిపడా మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ గంగా నదిలో ఇఫ్తార్ విందు చేసుకున్న కొంత మందిపై కేసులు నమోదు చేయడాన్ని ఆయన వివక్షగా అభివర్ణించారు. అలాగే, దేశంలో 67 శాతం మంది గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా ఉన్నారని, యువతను వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించి మతపరమైన చిచ్చు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story