- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : మంత్రి పొన్నం
హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.

దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు, నాణ్యత, గడువులోపు పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రధానంగా స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి సారించి, గతంలో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలన్నారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, ఎల్లమ్మ చెరువు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
వన మహోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలి
వన మహోత్సవం సందర్భంగా నియోజకవర్గంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ఏడు మండలాలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, సుమారు 2.5 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రధాన రహదారులకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని, ప్రతి గ్రామంలో ఐదుగురు సభ్యులతో ‘వన సంరక్షక్’ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. గత ఏడాది సిద్ధిపేట తరహాలో ఆశా వర్కర్ల నుండి కలెక్టర్ వరకు అందరూ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులకు లక్ష మొక్కల లక్ష్యాన్ని నిర్దేశించామని పేర్కొన్నారు. అలాగే, అటవీ శాఖ అధికారుల సమన్వయంతో ఈత, తాటి మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రతి ఇంటి వద్ద, అటవీ ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని ఆదేశించారు. నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాలైన మహాసముద్రం గండి, రాయికల్ వాటర్ ఫాల్స్, సర్వాయి పాపన్న కోట, భైరవస్వామి ఆలయం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, కమిషనర్ మల్లికార్జున్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






