PAC meeting: ఏడు అంశాలు ఎజెండాగా పీఏసీ సమావేశం

by Prasad Jukanti |

ఏడు అంశాలు ఎజెండాగా పీఏసీ సమావేశం కొనసాగుతోంది.

PAC meeting: ఏడు అంశాలు ఎజెండాగా పీఏసీ సమావేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఏడు అంశాలు ఎజెండాగా ఈ భేటీ కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి తరపున అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల పీఏసీ సమావేశం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఓటు చోరీ లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

ఎజెండా అంశాలు ఇవే:

పీఏసీ సమావేశం ఏడు ఎజెండాలపై చర్చ జరుగుతోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు, ఏఐసీసీ పిలుపు మేరకు ఓట్ చోరీ, గద్దీ చోడ్ ఉద్యమాన్ని రాష్ట్రంలో విస్తృతంగా చేపట్టే అంశం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, పెండింగ్ లో ఉన్న కమిటీల ఏర్పాటు, యూరియా కొరత పై బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న రాజకీయంతో పాటు ఇతర అంశాలపై ఈ సమావశంలో చర్చిస్తున్నారు.

బీఆర్ఎస్ దుష్ప్రచారం: మహేశ్ కుమార్ గౌడ్

దేశంలో ఓట్ చోరీ పెద్దఎత్తున జరిగిందని బీజేపీ ఓట్ చోరీ తోనే మూడో సారి గెలిచిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ చేస్తున్న ఉద్యమాన్ని రాష్ట్రంలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నదని రైతు భరోసా, రుణమాఫీ, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం లాంటి కార్యక్రమాలు మంచి స్పందన వస్తున్నాయని చెప్పారు. టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు ప్రజల్లో మంచి స్పందనతో పాటు ప్రజలు బ్రాహ్మరథం పడుతున్నారన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో మనం ఘన విజయం సాధించేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ను కూడా మనం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తూ రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తోందన్నారు. వీటన్నింటినీ చర్చించి ఒక ప్రణాళికతో ముందుకుపోదామని చెప్పారు.

Next Story