49 రకాల పనులతో కుదేలు.. అదనపు భారంతో ఏఈవోల కంట నీరు!

by Kema Shiva Kumar |

తెలంగాణలో వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOs) తమపై అదనపు పనిభారం మోపుతున్నారంటూ మండల వ్యవసాయ అధికారుల (AOs) తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

49 రకాల పనులతో కుదేలు.. అదనపు భారంతో ఏఈవోల కంట నీరు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణ అధికారులపై ఏఓల పెత్తనం పెరుగుతోందని, వారు తమ విధులు సక్రమంగా నిర్వహించకుండా తమపై అదనపు భారం మోపుతున్నారని ఏఈవోలు ఆరోపిస్తున్నారు. సొంత శాఖలోనే ఉన్నతాధికారుల తీరుతో వివక్షకు గురవుతున్నామని రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో జిల్లా వ్యవసాయ అధికారులకు నిరసన పత్రాలు అందజేశారు. ఇప్పటికే రైతు భరోసా, రైతుబీమా, మట్టి నమూనాల సేకరణ, మట్టి పరీక్షలు, రైతు గుర్తింపు కార్డుల నమోదు, పంటల సర్వే మొదలగు 49 రకాల విధులు నిర్వర్తిస్తూ తలకు మించిన భారాన్ని మోస్తున్నామని వాపోతున్నారు.

సర్వే బాధ్యత ఏఈఓల భుజాలపైనే..

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన డిజిటల్ పంట సర్వేలో భాగంగా రాష్ట్రంలో జియో రిఫరెన్స్ విలేజ్ మ్యాపులు ఉన్న 9,795 గ్రామాల్లో ఈ రబీ నుండి 100 శాతం పంట అమలు చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9,795 మంది వలంటీర్లను నియమించారు. జియో రిఫరెన్స్ మ్యాపులు లేని సుమారు 20 లక్షల ఫామ్ ఫీల్డ్స్ తో పాటుగా, కౌలు, ఎన్డీఎస్, సమస్యాత్మక భూములు, పట్టా లేకుండా రైతులు సాగు చేస్తున్న భూముల వివరాలతో పాటు గిరిజన రైతులు సాగు చేస్తున్న లక్షలాది ఎకరాల అటవీ హక్కు పత్రం కలిగి ఉన్న భూములను సైతం సర్వే చేసే బాధ్యతలను మళ్లీ ఏఈఓల భుజాలపైనే వ్యవసాయ శాఖ వేసింది. ఈ క్రమంలో వలంటీర్లతో పాటుగా ఏఈఓలు సైతం ప్రస్తుతం పంట సర్వేలో బిజీగా ఉన్నారు. ఇంకా ఫార్మర్స్ రిజిస్ట్రీ లో రైతుల నమోదు, యూరియా యాప్‌లో రైతుల మొబైల్ నంబర్ అప్డేషన్ వంటి పనులు చేస్తున్నారు.

పనితీరు పరిశీలకుండా తప్పించుకునే ప్రయత్నం

వలంటీర్లు పంట సర్వేలో భాగంగా తీసిన ఫొటోలను పరిశీలన చేసే బాధ్యతను వ్యవసాయ శాఖ మండల వ్యవసాయ అధికారులకు అప్పజెప్పింది. కానీ మండల వ్యవసాయాధికారులు ఆ భారాన్ని ఏఈఓలపై వేశారు. దీంతో ఏఈవోలు బగ్గుమంటున్నారు. వ్యవసాయ శాఖలో 49 రకాల పనుల భారం మోస్తూ శాఖకు వెన్నెముకగా నిలుస్తున్న తమపై ఉన్నతాధికారులు జులుం ప్రదర్శించడం తగదని వాపోతున్నారు.

ఆలస్యంగా విధులకు హాజరు!

వ్యవసాయ విస్తణాధికారులు విధులు సక్రమంగా నిర్వహించకుండా తమపై బాధ్యతలు మోపుతున్నారని ఏఈవోలు ఆరోపిస్తున్నారు. లక్షల జీతాలు తీసుకుంటూ ఏ చిన్న పనినైనా తమతో చేయించుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తమ శాఖ పరిధిలోని అధికారులంతా సమయపాలన పాటించాలని పలుమార్లు హెచ్చరింనా వారు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతిరోజు విధులకు హాజరై డ్యూటీ సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Next Story