- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓవర్ టూ ఢిల్లీ..! మంత్రుల పనితీరుపై హైకమాండ్‌కు సీఎం రిపోర్టు
మంత్రుల వద్ద ఉన్న శాఖలను మార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రుల వద్ద ఉన్న శాఖలను మార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నది. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో రాహుల్ గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మంతనాలు జరిపారు. అందులో భాగంగానే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సైతం ఉన్నట్టుండి ఢిల్లీకి పిలిపించుకున్నారు. శాఖల కేటాయింపుపై వీరితో చర్చించనున్నారు. మంత్రులందరి శాఖలు మార్చుతారా? కొందరివి మాత్రమే మార్పు చేస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. ఇటీవల మంత్రుల పనితీరుపై ఏఐసీసీ స్టేట్ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అధిష్టానానికి నివేదిక అందించినట్టు టాక్. దాని ఆధారంగానే శాఖల ప్రక్షాళనకు పార్టీ పెద్దలు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతున్నది.
రెండు రోజులుగా ఢిల్లీలోనే సీఎం రేవంత్
ఈనెల 8న కొత్తగా ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, వారికి ఇంతవరకు శాఖలు కేటాయించలేదు. ఈ కసరత్తులో భాగంగా ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను మార్చాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అందుకోసం ఈ నెల 9న ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ అక్కడే ఉన్నారు. శాఖల మార్పులు, చేర్పులపై ఇప్పటికే ఆయనతో రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ మాట్లాడినట్టు సమాచారం. అలాగే సీనియర్ మంత్రి ఉత్తమ్‌కు సైతం అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆయన కూడా మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. నేడు ఇరువురితో సంప్రదింపులు జరిపిన తరువాత శాఖల మార్పులు, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
అసంతృప్తి, పనితీరు ఆధారంగా..
తమకు సరైన శాఖలు ఇవ్వలేదని కొందరు మంత్రులు పలుసార్లు అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకెళ్లగా, సీనియార్టీకి తగ్గట్టుగా శాఖలు ఇవ్వలేదని మరికొందరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రచారం జరుగుతున్నది. మరోవైపు కొందరు మంత్రుల పనితీరు సంతృప్తికరంగా లేదని అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. దీంతో ఎవరెవరి శాఖలు మార్చుతారు? మంత్రులందరివి మార్చుతారా? లేక కొందరివేనా? అనే చర్చ జరుగుతున్నది. ఈసారి శాఖల కేటాయింపులో సోషల్ ఇంజినీరింగ్‌ను ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఓ వర్గం మంత్రులకు ప్రయారిటీ ఉన్న శాఖలు ఇచ్చి, మిగతా వర్గం మంత్రులకు అంతగా ప్రాధాన్యత లేని శాఖలు కేటాయించారనే విమర్శలకు అధిష్టానం చెక్ పెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది.
మీనాక్షి రిపోర్టు ఆధారంగానే..
పార్టీ ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మంత్రుల పనితీరుపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. వారి పనితీరు, కేటాయించిన శాఖల్లో ఏ మేరకు ప్రభావం చూపారు? ఎవరెవరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి? అనే అంశాలపై ఆమె ఫీడ్ బ్యాక్ తీసుకుని, ఓ రిపోర్టును తయారు చేసినట్టు తెలిసింది. దీనిని రాహుల్, కేసీ వేణుగోపాల్‌కు సమర్పించినట్టు సమాచారం. అదే రిపోర్టును వారం రోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి.. తన ఇంట్లో జరిగిన డిన్నర్ మీటింగ్ సమయంలో మంత్రుల చేతికి వారి పొగ్రెస్ రిపోర్టును అందించినట్టు ప్రచారం జరుగుతున్నది. దాని ఆధారంగానే మంత్రుల శాఖల్లో మార్పులు చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు సిద్ధమైనట్లు తెలుస్తున్నది.






