మా ఆదేశాలంటే లెక్క లేదా.. బుక్ మై షోపై హైకోర్టు సీరియస్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-12 08:22:37  IST  )

నటరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ-2 చిత్రం గురువారం రాత్రి ప్రీమియర్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

మా ఆదేశాలంటే లెక్క లేదా.. బుక్ మై షోపై హైకోర్టు సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: నటరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ-2 చిత్రం గురువారం రాత్రి ప్రీమియర్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే, అఖండ-2 ప్రీమియర్ షోలు ప్రదర్శనకు అనుమతినివ్వడం, టికెట్ రేట్లు పెంపునకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సవాల్ చేస్తూ అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా అఖండ ప్రీమియర్ షోల విషయంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని విజయ్ గోపాల్ అనే వ్యక్తి మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆ రెండు పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది.

వద్దన్నాక బుకింగ్స్ ఓపెన్ చేయడం ఏంటి..

వాదనల సందర్భంగా.. కోర్టు బుక్‌మైషోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ల రేట్ల పెంపుపై హైకోర్టు చెప్పాక ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేశామని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ధర్మాసనానికి తెలిపారు. అఅందుకు సంబంధించి కోర్టు ఉత్తర్వుల కాపీని బుక్‌మైషోకి కూడా అందజేశామని అన్నారు. ఈ క్రమంలోనే న్యాయమూర్తి మాట్లాడుతూ.. కానీ, ఆన్‌లైన్‌లో ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఉన్న రేట్ల ప్రకారమే టికెట్ల అమ్మకాలు ఎలా జరిగాయని ప్రశ్నించారు. అనంతరం బుక్‌మైషో నిర్వాహకులు అప్పటికే షో టైమ్ అయిపోయిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో కోర్టు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులంటే లెక్క లేదా మీకు అని ఫైర్ అయింది. తాము వద్దన్నాక కూడా బుకింగ్స్ ఓపెన్ చేయడం ఏంటని ప్రశ్నించగా.. బుక్‌మైషో నిర్వాహకులు నీళ్లు నమిలారు. సదరు వెబ్‌సైట్ నిర్వాహకులపై ఎందుకు కోర్టు ధిక్కార చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కోర్టు ఫైర్ అయింది.

మధ్యాహ్నం విచారణ..

కాగా, టికెట్ రేట్ల పెంపుపై నిన్న హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్‌లో అఖండ-2 మూవీ నిర్మాణ సంస్థ 14 రిల్స్ అప్పీల్ చేసింది. ఆ అప్పీల్‌పై ఇవాళ మధ్యాహ్నం 2.30కి విచారణ జరగనుంది.

Next Story