OTTs: క్రైమ్ స్కూల్స్ గా ఓటీటీలు.. సహస్ర హత్య కేసు ఓ హెచ్చరిక?

by Prasad Jukanti |   (  Updated:2025-08-23 06:51:26  IST  )

కూకట్ పల్లిలో సంచలనం సృష్టించిన సహస్ర హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి.

OTTs: క్రైమ్ స్కూల్స్ గా ఓటీటీలు.. సహస్ర హత్య కేసు ఓ హెచ్చరిక?
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ కూకట్ పల్లిలో (Kukat Pally) సంచలనం సృష్టించిన బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Murder) మిస్టరీ వీడింది. పక్క భవనంలో నివాసం ఉండే టెన్త్ క్లాస్ విద్యార్థే (15) కిల్లర్ గా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చోరీ కోసం ఇంట్లోకి ప్రవేశించిన ఆ బాలుడు ఈ క్రమంలో అడ్డు వచ్చిన బాలికను చంపేసిన తీరు కొత్త చర్చకు దారి తీస్తోంది. మిషన్ థెఫ్ట్ కోసం రాసుకున్న ప్లాన్ తిరగబడినా దాన్ని క్షణాల్లోనే మిషన్ మర్డర్ గా మార్చివేసి పక్కాగా అమలు చేసిన తీరు అందరిని విస్మయానికి గురి చేస్తోంది. పదోతరగతి కూడా పూర్తి కానీ ఈ బాలుడు ఇంతటి నేరాన్ని ఎలా చేయగలిగాడు? అనేది అందరిని టెన్షన్ పెట్టిస్తోంది. పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టిన ఈ బాలుడి నేర స్వభావం వెనుక విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓటీటీకి (OTTs) అలవాటు పడిన బాలుడు క్రైం వెబ్‌ సిరీస్‌లను చూడడమే పనిగా పెట్టుకున్నాడని అందులోని సన్నివేశాలను అనుకరిస్తూ చోరీకి ప్రణాళిక వేసి ఆ క్రమంలో అభం శుభం తెలియని బాలికను అన్యాయంగా బలి తీసుకున్న తీరు అందరిని ఉలిక్కిపడేలా చేసింది.

క్రైమ్ స్కూల్స్ గా ఓటీటీలు:

ప్రస్తుతం కొత్త కొత్త రీతుల్లో అందిస్తున్న కంటెంట్ తో ఓటీటీలకు ఆధరణ పెరుగుతున్నది. వెబ్ సీరీస్, మూవీస్, సీరియల్స్, హర్రర్, క్రైమ్ థ్రిల్లర్ లకు ఓటీటీ కేరాఫ్ గా మారాయి. రకరకాల కంటెంట్ తో రోజుకో వెబ్ సీరీస్ ప్రేక్షకుల ముందుకు దూసుకువస్తున్నాయి. అయితే వీటిలో క్రైమ్ థ్రిల్లర్స్ కంటెంట్ కు రికార్డు స్థాయిలో ఆదరణ లభిస్తోంది. ఇందులో చూపించే క్రైమ్ సీన్లతో పాటు నేరాలు చేయడం సాక్ష్యాధారాలను మాయం చేయడంపై పూసగుచ్చినట్లు చూపిస్తుండటంతో వీటిని చూసేందుకు జనాలు వెంపర్లాడుతున్నారు. ప్రస్తుతం క్రైమ్ పాఠాలకు అడ్డాగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ మారిపోయాయి. ఇందులో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, సిరీస్ లు చూసి క్రూరమైన నేరాలకు పాల్పడుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా నిత్యం ఎక్కడో చోటు వెలుగుచూస్తునే ఉంది. వీటిని చూసిన వారు క్రమంగా నేరాల బాట పడుతున్నారు. అలాంటి వారిలో చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా పోతోందనే అభిప్రాయులు ఉన్నాయి. ముఖ్యంగా కల్మషనం లేని పసి పిల్లలను ఓటీటీ క్రైమ్ కంటెంట్ నేరస్థులుగా మార్చుతున్నాయనే ఆందోళనలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఓటీటీ కంటెంట్ ప్రజలకు అగాహన కల్పించడం కంటే నేరాలను ప్రోత్సహించేందుకు అడ్డాలుగా మారిపోయాయనే విమర్శలు ఉన్నాయి. సహస్ర హత్య కేసులోనూ నిందితుడి నేర స్వభావం వెనుక ఓటీటీల ప్రభావం పిల్లలపై ఏ మేరకు ఉంటోందో అర్థం చోసుకోవచ్చనే చర్చ జరుగుతోంది. సహస్రను హత్య చేశాక నిందితుడు తాను దొరికిపోకుండా విచారణకు వచ్చిన పోలీసుల వెంట తిరగడం, విచారణ సమయంలో అందరితో పాటు తనను ప్రశ్నించగా మూడు సార్లు సహస్ర డాడీ అని పిలిచిందంటూ బాలిక తండ్రిపైనే పోలీసులు అనుమానించేలా సీన్ మొత్తం మార్చేసే ప్రయత్నం చేయడం చూస్తుంటే ఓటీటీల విషయంలో మరింతగా అలర్ట్ గా ఉండాలనే విషయం హెచ్చరిస్తోందనే చర్చ జరుగుతోంది.

క్రైమ్ కంటెంట్ కు అడ్డుకట్టేది?:

ఓటీటీలకు సెన్సార్ షిప్ లేకపోవడంతో ఓటీటీల్లో క్రైమ్ సీన్స్ హద్దుమీరుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఏ మాత్రం సామాజిక బాధ్యత లేకుండా టెర్రర్ పుట్టిస్తున్నాయి. కొన్ని క్రైమ్ హర్రర్ మూవీస్ చూస్తే సామాన్యులు కూడా క్రిమినల్స్ గా మారే విధంగా ఉంటున్నాయని సైకియాట్రిస్టులు హెచ్చరిస్తున్నారు. అయినా ప్రభుత్వాలు వీటిని కంట్రోల్ చేయడంలో విఫలం అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మారుతున్న జీవనశైలి కారణంగా పేరెంట్స్ సైతం బిజీ బిజీగా మారిపోతున్నారు. తమ పిల్లల జీవితాలను మానిటరింగ్ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నారు. పరిస్థితులు ఇలాగే పసిపిల్లల్లో నేర స్వభాం ఓ సామాజిక సమస్యగా మారే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి నేరస్వాభాలను ప్రోత్సహించే ఓటీటీలు, సోషల్ మీడియా కంటెంట్ ల విషయంలో ప్రభుత్వాలు, యంత్రాంగం ఉక్కుపాదం మోపాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Read More..

ఉపాధ్యాయుడి దుశ్చర్య.. స్కూల్ వాటర్ ట్యాంక్‌లో విషం కలిపిన వైనం

Next Story