- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు అలర్ట్: ఆదిత్య కాలేజీల అడ్మిషన్లు అక్రమం.. OU సంచలన ప్రకటన
రాష్ట్రంలో ధనార్జనే ధ్యేయంగా కొత్త కాలేజీలు పుట్టుకొస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ధనార్జనే ధ్యేయంగా కొత్త కాలేజీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల జాప్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలేజీలు ఒకవైపు, దోస్త్ పరిధిలో లేకుండా స్వతంత్రంగా ఎంట్రన్స్ నిర్వహించుకుంటూ విద్యార్థులను ఆకర్షిస్తున్న కాలేజీలు మరొకవైపు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో అఫ్లియేషన్ లేకుండా, మందుస్తు అనుమతులు లేకుండా, మొత్తం 12 బ్రాంచిల్లో ఆదిత్య డిగ్రీకాలేజీ అడ్మిషన్లు చేపడుతున్నాయని విద్యార్థి సంఘాల నుండి విద్యాశాఖకు భారీ ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో స్పందించిన ఉస్మానియా యూనివర్శిటీ ఈ కాలేజీలకు యూనివర్శిటీ నుండి ఎలాంటి అనుబంధ గుర్తింపు (అఫ్లియేషన్) లేదని, పాత అనుమతుల పొడిగింపు కూడా లేదని స్పష్టం చేస్తూ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా ఆదిత్య గ్రూప్ ఆఫ్ కాలేజీలకు సంబంధించి వస్తున్న ఆకర్షణీయమైన ప్రకటనలను చూసి విద్యార్థులు అందులో చేరవద్దు. ఒకవేళ చేరితే తదుపరి జరిగే నష్టానికి యూనివర్శిటీ బాధ్యత వహించదని స్పష్టం చేసింది.
అనుమతులు లేవు.. ప్రచారాలు మాత్రం హోరు...
తెలంగాణ ఉన్నత విద్యామండలి, ఉన్నత విద్యాశాఖ, ఉస్మానియా యూనివర్శిటీ నుండి అధికారికంగా ఎటువంటి అనుమతులు పొందకుండానే, ఆదిత్య డిగ్రీ కాలేజీలు, ఆదిత్య బిజినెస్ స్కూల్ పేరుతో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్నట్లు వర్సిటీ అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా సోషల్ మీడియా, హెర్డింగులు, పోస్టర్ల ద్వారా ఈ కాలేజీలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఆదిత్య డిగ్రీ కళాశాల అఫిలియేషన్ లేకుండా అడ్మిషన్లు, అనధికారిక ప్రవేశ పరీక్షలు, తప్పుడు ప్రచారాల ద్వారా విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నాయని విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థుల అడ్మిషన్లు సైతం తీసుకుంటున్నారని, కాగా, ఈ కాలేజీ దోస్త్ పరిధిలో లేకుండా అడ్మిషన్లు చేపడుతున్నట్లు చెబుతున్నారు. ముందస్తు అడ్మిషన్లు యూనివర్సిటీ అఫిలియేషన్ నిబంధనలకు విరుద్ధమని, యూజీ కోర్సులలో అడ్మిషన్లు సాధారణంగా ఇంటర్మీడియట్ మెరిట్ ఆధారంగా ఇవ్వాలని, కానీ ఆదిత్య డిగ్రీ కాలేజీ స్వతంత్రంగా ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించడం చట్టబద్ధం కాదని చెబుతున్నారు. ఓయూ అధికార యంత్రాంగం తక్షణమే ఆదిత్య డిగ్రీ కళాశాల అఫిలియేషన్ స్థితిని వెంటనే వెల్లడించాలని, అక్రమ అడ్మిషన్లను నిలిపివేయాలని, కాలేజ్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సీజేఎస్ వరుస ఫిర్యాదులతో స్పందించిన వర్సిటీ..
గత కొంతకాలంగా ఆదిత్య కాలేజీల అక్రమ అడ్మిషన్లు, తప్పుడు ప్రచారాలపై మొదటి నుండి సీజేఎస్ సంస్థ వరుస ఫిర్యాదులు చేస్తోంది. ఫిర్యాదులపై విచారణ చేపట్టిన అధికారులు, సదరు కాలేజీలకు ఎటువంటి అఫ్లియేషన్ లేదని తేల్చారు. నిబంధనలు పాటించకుండా అడ్మిషన్లు చేపడితే విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని స్పష్టం చేశారు. ఇదే విషయంపై ఇటీవల సీఎంఓ, ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదు చేయడంతో కాలేజీ విషయంలో ఏం చేద్దామనే చర్చ భారీ ఎత్తున జరిగినట్లు ఉన్నత విద్యా మండలి, ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు చెబుతున్నారు.






