ఉస్మానియా వైద్యుల అద్భుతం.. 18 నెలల చిన్నారికి పునర్జీవితం

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు మరోసారి తమ అసాధారణ నైపుణ్యాన్ని చాటుకున్నారు.

ఉస్మానియా వైద్యుల అద్భుతం.. 18 నెలల చిన్నారికి పునర్జీవితం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు మరోసారి తమ అసాధారణ నైపుణ్యాన్ని చాటుకున్నారు. అత్యంత అరుదైన ‘గ్లైకోజెన్ స్టోరేజ్’ (టైప్-3) వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 18 నెలల చిన్నారికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కేవలం 10 కిలోల బరువున్న బాలుడికి, అతని తండ్రి నుంచి సేకరించిన కాలేయ భాగాన్ని అమర్చి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో దాదాపు రూ. 50 లక్షల వరకు ఖర్చయ్యే ఈ క్లిష్టమైన సర్జరీని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి ఉచితంగా నిర్వహించి, ప్రభుత్వ వైద్య రంగంలో సరికొత్త మైలురాయిని అధిగమించారు.

అరుదైన వ్యాధి... గ్లైకోజెన్ స్టోరేజ్..

హైదరాబాద్‌ నగరానికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్, సాజియా దంపతుల 18 నెలల కుమారుడు అఫన్.. గత కొంతకాలంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. పిల్లాడు తరచుగా ఆకలితో ఏడుస్తుండడం, మత్తుగా ఉండటం, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలతో బాలున్ని తల్లిదండ్రులు ఉస్మానియా హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. డాక్టర్లు ఆ బాలున్ని పరీక్షించి, అవసరమైన వైద్య పరీక్షలు చేయించారు. రక్తంలో షుగర్ లెవల్స్‌ చాలా తక్కువగా ఉండడం, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండటం, కాలేయం అసాధారణంగా విస్తరించి ఉండడాన్ని డాక్టర్లు గుర్తించారు. బాలుని సమస్యపై మరింత లోతుగా అధ్యయనం చేసి, అతను గ్లైకోజెన్ స్టోరేజ్ ( టైప్-III) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టుగా నిర్ధారించారు. ఈ వ్యాధి శరీరంలో గ్లైకోజెన్‌ను గ్లూకోజ్‌గా మార్చే ఎంజైమ్ లోపంతో ఏర్పడుతుందని, దీని కారణంగా శరీరంలో నిల్వ ఉన్న శక్తిని వినియోగించుకోలేకపోవడం, తరచూ హైపోగ్లైసీమియా, కాలేయం పెద్దగా అవడం, కండరాల బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయని శస్త్ర చికిత్స బృందానికి నేతృత్వం వహించిన సర్జికల్ గ్యాస్ట్రో హెచ్ఓడీ డాక్టర్ మధుసూదన్ తెలిపారు. దీర్ఘకాలంలో గుండె, మెదడు, కండరాలపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందన్నారు.

రూ.50 లక్షల సర్జరీ ఉచితంగా..

చిన్నారి అఫన్ అప్పటికే వ్యాధి ముదిరి, పరిస్థితి విషమంగా మారడంతో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. చిన్నారి తండ్రి నుంచి లివర్‌లోని కొంత భాగాన్ని సేకరించి, బాలుడికి అమర్చారు. డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి చెందిన వైద్యుల బృందం సుమారు 14 గంటల పాటు ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి, బాబుకు పునర్జన్మను ప్రసాదించారు. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇప్పటివరకు ఎలాంటి సంక్లిష్టతలు లేకుండా కోలుకుంటున్నాడని డాక్టర్ మధుసూదన్ వెల్లడించారు. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో సుమారు 50 లక్షల వరకూ చార్జ్ చేసే ఈ సర్జరీని, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ సహకారంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేశామని ఉస్మానియా సూపరింటెండెంట్‌, డాక్టర్ రాకేశ్‌ సహాయ్ తెలిపారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ అనంతరం అవసరమైన మందులను కూడా ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. దేశంలో ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఇలాంటి శస్త్రచికిత్సలు చాలా అరుదుగా జరుగుతాయని, ముఖ్యంగా గ్లైకోజెన్ స్టోరేజ్ డిసీజ్ వంటి అరుదైన వ్యాధులకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిర్వహించడం వైద్య రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని డాక్టర్లు తెలిపారు.

వైద్యుల సేవలు గొప్పవి: మంత్రి దామోదర్ రాజనర్సింహా..

కేవలం 10 కిలోల బరువున్న చిన్నారికి అత్యంత అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడిన ఉస్మానియా డాక్టర్ల బృందాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో పనిచేస్తున్న డాక్టర్ల సామర్థ్యాన్ని మరోసారి నిరూపించారని మంత్రి కొనియాడారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్న వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా లక్షల మంది పేషెంట్లకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయని మంత్రి గుర్తు చేశారు.

Next Story