ఉస్మానియా వైద్యులు దేశానికే గర్వకారణం : మంత్రి దామోదర్ రాజనర్సింహ

by Naga Rani Yarlagadda |

ఉస్మానియా డాక్టర్లు తెలంగాణతో పాటు యావత్ దేశానికే గర్వకారణంగా నిలిచారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కొనియాడారు.

ఉస్మానియా వైద్యులు దేశానికే గర్వకారణం : మంత్రి దామోదర్ రాజనర్సింహ
X
  • దేశంలోనే తొలిసారిగా అరుదైన అవయవాల మార్పిడితో రికార్డుకెక్కారు

దిశ, తెలంగాణ బ్యూరో: ఉస్మానియా డాక్టర్లు తెలంగాణతో పాటు యావత్ దేశానికే గర్వకారణంగా నిలిచారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కొనియాడారు. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సల్లో ఒకటిగా భావించే మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను డాక్టర్ మధుసూదన్ బృందం 36 గంటల పాటు శ్రమించి విజయవంతం చేయడం అసాధారణ విజయమన్నారు. దేశ వైద్య చరిత్రలోనే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య బృందం అరుదైన ఘనత సాధించిన వైద్య బృందాన్ని మంత్రి అభినందించారు. దేశంలోనే తొలిసారిగా ఒకే రోగికి, ఒకేసారి ఐదు అవయవాల (మల్టీ-విసెరల్) మార్పిడి శస్త్రచికిత్సను ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహించి సరికొత్త రికార్డు సృష్టించారని కితాబునిచ్చారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించిన ఉస్మానియా సర్జికల్ గ్యాస్ట్రో హెచ్ఓడీ డా. మధుసూదన్ నేతృత్వంలోని వైద్య బృందాన్ని మంత్రి శుక్రవారం సచివాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ ప్రక్రియలో భాగస్వాములైన గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు, అనస్థీషియా నిపుణులు, క్రిటికల్ కేర్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్లందరినీ మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. అలాగే, అవయవదానం ద్వారా మరొకరికి పునర్జన్మ ప్రసాదించిన దాత కుటుంబ సభ్యుల సేవాభావాన్ని కొనియాడుతూ.. ‘అవయవదానం.. మహాదానం’ అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ సమాజంలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని... ప్రభుత్వ హాస్పిటల్స్‌లోనే ప్రజలకు అన్నిరకాల మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు..

గత రెండున్నరేళ్లలో ఆరోగ్యశాఖలో సుమారు 15 వేల పోస్టులను భర్తీ చేశామని, తాజాగా మరో 6,238 పోస్టులను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. పాత, అద్దె భవనాల్లో నడుస్తున్న ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలకు కొత్త భవనాలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రోగ నిర్ధారణ కోసం అత్యాధునిక ఎక్విప్‌మెంట్, అడ్వాన్స్‌డ్ ఆపరేషన్ థియేటర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ జాతీయ స్థాయిలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉస్మానియా వైద్యులు డా. సుదర్శన్ రెడ్డి, డా. యాస్మీన్ ఫాతిమా, డా.భావన, వైద్యులు, నర్సింగ్, ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు.

Next Story