Prajavani: గడువులోగా పరిష్కరించాల్సిందే.. లేకపోతే..

by Gantepaka Srikanth |

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని మరింత వికేంద్రీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది.

Prajavani: గడువులోగా పరిష్కరించాల్సిందే.. లేకపోతే..
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని మరింత వికేంద్రీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రజల సమస్యలను వారి చెంతనే పరిష్కరించాలనే లక్ష్యంతో.. ప్రస్తుతం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని తక్షణమే రెవెన్యూ డివిజన్ స్థాయికి విస్తరింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భవిష్యత్తులో దీనిని మండల స్థాయికి కూడా తీసుకెళ్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వ తాజా మార్గదర్శకాల ప్రకారం ప్రజావాణి వేదికలు ఇలా ఉండనున్నాయి. రాష్ట్ర స్థాయి ప్రజావాణి హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో ప్రతీ మంగళవారం, శుక్రవారం నిర్వహిస్తారు. దీనిని రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ పర్యవేక్షిస్తారు. జిల్లా స్థాయిలో ప్రతీ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లేదా కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. డివిజన్ స్థాయిలో ప్రతీ సోమవారం సబ్ కలెక్టర్ లేదా ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించాల్సి ఉంటుంది. ఇక్కడ అన్ని శాఖల డివిజన్ స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ఫిర్యాదులను స్వీకరిస్తారు.

30 రోజుల్లోనే పరిష్కారం..

కాగా.. తీసుకున్న ప్రతీ దరఖాస్తుకు 30 రోజుల్లేనే పరిష్కారం చూపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆన్‌లైన్‌లో ట్రాకింగ్ ప్రజావాణిలో వచ్చే ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించింది. అలాగే.. ఫిర్యాదుదారులకు ఒక ప్రత్యేక ఐడీతో కూడిన రశీదును సైతం ఇస్తారు. దీని ద్వారా వారు తమ ఫిర్యాదు స్థితిని ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. అధికారులు ఫిర్యాదు అందిన 30 రోజుల్లోపు ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపాలని ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ గడువులోగా పరిష్కరించకపోతే, ఆ ఫిర్యాదు ఆటోమేటిక్‌గా పై అధికారుల పరిశీలనకు వెళ్తుందని హెచ్చరించింది. ఫిర్యాదుల పరిష్కారంపై పౌరుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడానికి ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని తక్షణమే ప్రారంభించాలని కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు ఆదేశించారు. ప్రజలకు జవాబుదారీగా, మానవీయ కోణంలో సమస్యలను పరిష్కరించడమే ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

Next Story