స్ధానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత బయటపడింది : బీజేఎల్పీ నేత మహేశ్వర్​రెడ్డి

by Muthe.Rajitha |

గ్రామ సర్పంచుల ఎన్నికల ఫలితాల ద్వారా కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి పెద్ద ఎత్తున వ్యక్తమవుతోందని బీజేఎల్పీ నేత మహేశ్వర్​రెడ్డి ఆరోపించారు.

స్ధానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత బయటపడింది : బీజేఎల్పీ నేత మహేశ్వర్​రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామ సర్పంచుల ఎన్నికల ఫలితాల ద్వారా కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి పెద్ద ఎత్తున వ్యక్తమవుతోందని బీజేఎల్పీ నేత మహేశ్వర్​రెడ్డి ఆరోపించారు. చాలా చోట్ల త్రిముఖ పోటీ కనిపించిన ప్రజలు స్పష్టంగా బీజేపీకి మద్దతుగా నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నిర్మల్ నియోజకవర్గంలో 128 గ్రామ పంచాయతీలకు దాదాపు 80 గ్రామ సర్పంచులను బీజేపీకి మద్దతుగా గెలిపించారని, ముధోల్ నియోజకవర్గంలోని 178 గ్రామ పంచాయతీలకు గాను 98 గ్రామ పంచాయతీల్లో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయన్నారు.

ఈ ఫలితాలు ప్రజలు కాంగ్రెస్ పాలనను తిరస్కరిస్తూ, బీజేపీపై ప్రజా విశ్వాసం పెరిగిందనడానికి స్పష్టమైన సంకేతాలన్నారు. నిర్మల్ జిల్లాలో 213 మంది గ్రామ సర్పంచులను కమలం పార్టీ మద్దతుతో ప్రజలు గెలిపించారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన అవినీతిలో మునిగిపోయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమై, ఆరు గ్యారంటీలు, 420 హామీలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా గాడి తప్పించిందన్నారు. గ్రామ సర్పంచుల ఎన్నికల తీర్పు, అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు స్పష్టమైన ప్రతిబింబం అన్నారు.

సింబల్స్ లేవని, అధికారం ఉందని చెప్పి గెలిచిన సర్పంచులను కాంగ్రెస్ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. నిజంగా సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, తక్షణమే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించాలి. అప్పుడు ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టంగా బయటపడుతుందన్నారు. కేవలం రెండు సంవత్సరాల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంతటి ప్రజావ్యతిరేకత కూడగట్టుకోవడం రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యానికి నిదర్శనం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలని సూచించారు. గత 11 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ భారీగా నిధులు కేటాయిస్తోంది.

దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా, తెలంగాణలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలను బీజేపీ ముందుండి అమలు చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా ఫలితాలు వస్తాయని పూర్తి విశ్వాసం ఉందన్నారు. మాపార్టీ నేతలు సమిష్టిగా పని చేస్తూ, రాబోయే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్​తమ వైఫల్యాను కప్పిపుచ్చుకునేందు ముట్టడి : పొంగులేటి సుధాకర్ రెడ్డి

దేశవ్యాప్తంగా నేషనల్ హెరాల్డ్ కేసు పేరుతో ఏదో జరిగిపోయిందన్నట్లుగా చూపిస్తూ, తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కార్యాలయాలను ముట్టడించేలా కార్యక్రమం నిర్వహించిందని మండిపడ్డారు. ఈచర్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు , నేషనల్ హెరాల్డ్ కేసు పూర్తిగా న్యాయవ్యవస్థ పరిధిలో ఉన్న అంశమన్నారు. ఈడీ జారీ చేసిన నోటీసులు, దర్యాప్తు అన్నీ చట్టబద్ధమైనవే. తమ పార్టీ ఎప్పుడూ న్యాయవ్యవస్థను గౌరవించే పార్టీ అన్నారు.

కోర్టు తీర్పు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటే న్యాయవ్యవస్థ గొప్పగా పనిచేసింది అంటారు. అదే తీర్పు అనుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టు తీర్పులు, ఈడీ, సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖలను కూడా తూర్పారబట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని, ఎన్నికల వ్యవస్థను, హోం మంత్రిత్వ శాఖను లక్ష్యంగా చేసుకుని ఏది పడితే అది బురద జల్లే రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్​నేతలను హెచ్చరించారు.

Next Story