యూజీసీ ముసాయిదాను వ్యతిరేకించండి : మాజీ ఎంపీ వినోద్‌కుమార్

by M.Rajitha |
యూజీసీ ముసాయిదాను వ్యతిరేకించండి :  మాజీ ఎంపీ వినోద్‌కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: యూజీసీ కొత్త నిబంధనలపై అనేక రాష్ట్రాలు నిరసన తెలుపుతున్నాయని.. మన ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి పంపించాలని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళనాడు అసెంబ్లీ యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా తీర్మానం చేసిందని.. కేరళ సీఎం కూడా యూజీసీ ప్రతిపాదనలను వ్యతిరేకించారని తెలిపారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షమైనప్పటికీ బిహార్ సీఎం నితీష్ కుమార్ కూడా యూజీసీ ప్రతిపాదనలు వ్యతిరేకించారని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీలోనూ యూజీసీ ముసాయిదాకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అభిప్రాయాలను చైర్మన్ జగదీశ్‌కుమార్‌కు పంపించినట్లు తెలిపారు. వీసీల నియామకం అధికారాన్ని గవర్నర్‌కు కట్టబెట్టడం అప్రజాస్వామికమన్నారు. త్వరలో కేంద్ర విద్యా శాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్‌ను కలిసి అభ్యంతరాలను తెలియజేస్తామన్నారు. అలాగే.. తెలంగాణలో జాతీయ రహదారులకు సంబంధించి నితిన్ గడ్కరీని కలిసి వినతి పత్రం ఇస్తామని తెలిపారు. బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయానికి కొత్త నిబంధనలు పాతర వేస్తాయని అన్నారు. ప్రాంతీయ భాషల్లో విద్యను అభ్యసించే వారికి ఈ నిబంధనలు గొడ్డలి పెట్టుగా మారబోతున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. యూజీసీ కొత్త నిబంధనలను విద్యార్థి సంఘాలుగా తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed