ఆప‌రేష‌న్ ‘అంబీర్ చెరువు’.. చికెన్, చేప‌ల‌ వ్య‌ర్థాలే! 104 లారీల చెత్త‌ను తొల‌గించిన హైడ్రా

by Ramesh Naini |

స‌క‌ల జీవ‌కోటికి ప్రాణాధారంగా ఒక‌ప్పుడు పేరుగాంచిన ప్ర‌గ‌తిన‌గ‌ర్ (అంబీర్‌) చెరువు ఆన‌వాళ్లు కోల్పోయింది.

ఆప‌రేష‌న్ ‘అంబీర్ చెరువు’.. చికెన్, చేప‌ల‌ వ్య‌ర్థాలే! 104 లారీల చెత్త‌ను తొల‌గించిన హైడ్రా
X

దిశ, డైనమిక్ బ్యూరో: స‌క‌ల జీవ‌కోటికి ప్రాణాధారంగా ఒక‌ప్పుడు పేరుగాంచిన ప్ర‌గ‌తిన‌గ‌ర్ (అంబీర్‌) చెరువు ఆన‌వాళ్లు కోల్పోయింది. న‌గ‌రీక‌ర‌ణ‌లో ప‌రిస‌రాల‌న్నీ కాంక్రీట్ జంగిల్‌గా మారిపోగా.. వ్య‌ర్థాల‌కు నిల‌యంగా మారింది. చికెన్, మాంసం, చేప‌ల‌ వ్య‌ర్థాలతో దుర్గంధ‌భ‌రితమైంది. దీంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. స‌హ‌జ‌త్వాన్ని కోల్పోయిన చెరువుకు పున‌రుజ్జీవం ఇవ్వాల‌ని స్థానికులు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ని క‌లిసారు. ఫ‌ర్ ఏ బెట‌ర్ సొసైటీ ప్ర‌తినిధులు కూడా ఇందులో ఉన్నారు. ప్ర‌జావాణిలో ఫిర్యాదు కూడా చేశారు. ఈ మేరకు క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల మేర‌కు వెనువెంట‌నే అక్క‌డ ప‌రిస్థితిని ప‌రిశీలించి హైడ్రా రంగంలోకి దిగింది. ముందుగా చెత్త వేయ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంది. చికెన్ వ్య‌ర్థాలు వేయ‌డానికి వ‌చ్చిన 4 వాహ‌నాల‌ను హైడ్రా ప‌ట్టుకుంది. చెత్త‌ను తొల‌గించే ప‌నుల‌ను పెద్ద‌ఎత్తున చేప‌ట్టింది.

సెల‌వుల్లోనూ ఆగ‌ని ప‌నులు..

క్రిస్మ‌స్ ప‌డంగ‌తో పాటు.. వారాంతం సెల‌వులున్నా హైడ్రా ప‌నులు కొన‌సాగిస్తూనే వ‌చ్చింది. 5 నుంచి 6 లారీలు, 3 జేసీబీల‌తో చెత్త‌ను తొల‌గిస్తోంది. ఆప‌రేష‌న్ అంబీర్ చెరువు మాదిరి ప‌నులు చేస్తూ.. శ‌నివారం వ‌ర‌కూ 104 లారీల చెత్త‌ను హైడ్రా త‌ర‌లించింది. చెరువు ఒడ్డున గుట్ట‌లుగా చెత్త పేరుకుపోయింద‌ని, మ‌రో వంద లారీలకు పైగా ఉంటుంద‌ని అక్క‌డ ప‌నులు చేప‌ట్టిన అధికారులు చెబుతున్నారు. కూక‌ట్‌ప‌ల్లి - ప్ర‌గ‌తిన‌గ‌ర్‌ల‌ను క‌లుపుతూ ప్ర‌గ‌తిన‌గ‌ర్ చెరువు మ‌ధ్య‌లోంచి వేసిన రోడ్డుకు ఇరువైపులా పూర్తిగా చెత్త‌ను తొల‌గించాల్సి ఉంద‌ని అంటున్నారు. ఇక్క‌డ చిరు వ్యాపారుల‌తో మాట్లాడి ప్ర‌త్యామ్నాయ స్థ‌లంలో అమ్మ‌కాలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారుల‌తో స‌మ‌న్వ‌యంతో ప‌ని చేస్తున్నారు. చెత్త‌ను పూర్తిగా తొల‌గించి.. ఫెన్సింగ్ వేయాల‌ని నిర్ణ‌యించింది.

హైడ్రాతో చేతులు క‌లిపిన స్థానికులు..

ప్ర‌గ‌తిన‌గ‌ర్ చెరువు ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణాన్ని అనుభ‌వించిన స్థానికులు హైడ్రాతో చేతులు క‌లిపారు. చెరువులోంచి వెళ్లే ప్ర‌ధాన ర‌హ‌దారికి ఇరువైపుల ఉన్న చిరు వ్యాపారుల‌కు ప్ర‌త్యామ్నాయం స్థ‌లం చూపించాల‌ని కోరుతున్నారు. ఈ మేర‌కు జీహెచ్ ఎంసీ, రెవెన్యూ అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. ఇందుకు త‌మ స‌హ‌కారం ఉంటుంద‌ని చెబుతున్నారు. త‌ర్వాత చెత్త వేయ‌డానికి వీలు లేకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల‌ని కోరుతున్నారు. ప్ర‌గ‌తిన‌గ‌ర్‌, నిజాంపేట్‌, కూక‌ట్‌ప‌ల్లి ప్రాంతాల నుంచి వ‌చ్చే మురుగు నీటిని ప్ర‌గ‌తిన‌గ‌ర్ చెరువుకు చేర‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. ఎస్టీపీ (సీవ‌రేజ్ ట్రీట్‌మెంట్ ప్లాట్ల‌)ల‌తో చెరువుకు మంచినీరు చేరేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు.

Next Story