- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దండకారణ్యంలో మిగిలింది మూడు దళాలే..! తెలంగాణ వాసి ‘రూపి’ దళంపైనే అందరి దృష్టి
దండకారణ్యంలో మావోయిస్టుల అగ్ర నాయకత్వం పూర్తిగా బలహీనపడుతోంది. పాపారావు లొంగుబాటు తర్వాత మధ్య భారతంలో కేవలం మూడు దళాలు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లుగా తెలుస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) సభ్యుడు పాపారావు అలియాస్ సున్నం చంద్రయ్యతో పాటు మరో 17 మంది నిన్న బీజాపూర్ పోలీసుల ఎదుట లొంగిపోవడంతో.. ఇప్పుడు చర్చ అంతా అక్కడ ఇంకా ఎంతమంది ఉన్నారు? అందులో కీలక నేతలు ఎవరైనా ఉన్నారా? అనే అంశంపై మళ్లింది. ఛత్తీస్‌గఢ్ మీడియా వర్గాల అంచనా ప్రకారం.. ఇప్పటికీ దండకారణ్యంలో మూడు దళాలు ఇంకా యాక్టివ్‌గా ఉన్నట్లుగా భద్రతా బలగాలు గుర్తించాయి.
మాడ్-నార్త్ బస్తర్ సరిహద్దులో రూపి అలియాస్ రంగబోయిన భాగ్య (తెలంగాణ) దళం, బీజాపూర్-తెలంగాణ సరిహద్దుల్లో హేమ్లా బిచ్చా, సోఢీ కేశా దళాలు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూడు దళాల్లో కలిపి సుమారు 50 మంది వరకు మావోయిస్టులు ఉన్నారని సమాచారం. అదేవిధంగా 15 రోజుల క్రితం రూపి దళానికి, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు (Encounter) జరిగినప్పటికీ, దళ సభ్యులంతా సురక్షితంగా తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
పాపారావు ప్రభావంతో లొంగుబాట్లు పెరుగుతాయా?
ఈ మూడు దళాలు కూడా ఇప్పటివరకు పాపారావు నాయకత్వంపై నమ్మకంతో తమ కార్యకలాపాలు కొనసాగించాయి. అయితే ఇప్పుడు ఆయన లొంగిపోవడంతో, మిగిలిన వారు కూడా త్వరలోనే జనజీవన స్రవంతిలోకి వస్తారని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా ఈ నెల 31 డెడ్‌లైన్ లోపు వీరిని లొంగిపోయేలా చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాపారావును ఇప్పటివరకు మీడియా ముందుకు ప్రవేశపెట్టకపోవడానికి ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది. మరోవైపు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి వంటి అగ్రనేతలు ఇప్పటికే తెలంగాణలో లొంగిపోవడం, అలాగే లొంగిపోనీ పక్షంలో భారీ కూంబింగ్ కార్యకలాపాలు చేపట్టి అంతమొందిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించడం కూడా వీరి లొంగుబాటుకు దోహదపడుతుందని భావిస్తున్నారు.
రూపిది తెలంగాణే..
రూపి అలియాస్ రంగబోయిన భాగ్య స్వస్థలం తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామం. సుమారు 46 ఏళ్ల వయసున్న ఆమె 2004లో మావోయిస్టు పార్టీలో చేరి, మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ఆ తర్వాత అబూజ్‌మడ్‌లో పనిచేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన భారీ లొంగుబాట్ల సందర్భంగా.. తెలంగాణలో ఇంకా మిగిలి ఉన్న మావోయిస్టుల జాబితాను రాష్ట్ర డీజీపీ విడుదల చేయగా.. అందులో రూపి పేరు ఉండటం గమనార్హం.






