- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘హైడ్రా’ రద్దు కోరుకునేది కబ్జాదారులే.. CM రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని విపక్షాలపై నిప్పులుచెరిగారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పరీక్షల నిర్వహణ, ఫీజు రీయింబర్స్‌మెంట్, హైడ్రా (HYDRA) అంశాలపై ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు.
ఆన్‌లైన్ పరీక్షలతో నో టెన్షన్..
ఉద్యోగ పోటీ పరీక్షలైనా, ఉన్నత చదువుల పరీక్షలైనా.. ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తేనే సమస్యలు వస్తున్నాయని, ఆన్‌లైన్‌లో నిర్వహిస్తే ఏ సమస్యా ఉండదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. దేశంలో పేపర్ లీక్‌కు పాల్పడిన బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కొన్ని పరీక్షలను విద్యాశాఖలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అధికారాలను కేంద్ర ప్రభుత్వం లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రం ఎలాంటి బేషజాలు పోకుండా దేశంలో అత్యున్నత పరీక్షల యూనివర్సిటీలు, ఇతర స్వతంత్ర సంస్థలపై ఆధిపత్యం చెలాయించకుండా ఉంటే బెటర్ అని హితవు పలికారు. పేపర్ లీకేజీలపై పార్లమెంట్ ఉభయ సభల్లో సమగ్రంగా చర్చ జరగాలని, అంతిమంగా విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తమ అధినేత రాహుల్ గాంధీ లోక్‌సభలో విద్యార్థుల పక్షాన నిలబడి కొట్లాడుతున్నారని, ఈ విషయంలో మిత్రపక్షాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. విద్య వీలైనంత వరకు రాష్ట్ర పరిధిలో ఉంటే తప్పిదాలు జరగకుండా ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విపక్షాల ఫేక్ ప్రచారం
తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రశ్నాపత్రాల లీకేజీపై కఠినంగా ఉంటామని సీఎం చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని గుర్తుచేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేసి నియామకాలు చేపడుతున్నామని అన్నారు. గ్లోబరీనా లాంటి సంస్థలు నాడు తెలంగాణలో అక్రమాలకు పాల్పడ్డాయని, నాడు ఆ సంస్థపై చర్యలు తీసుకుని ఉంటే నేడు సీబీఎస్‌ఈలో గందరగోళం జరిగే పరిస్థితి ఉండేది కాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరిట భారీ దోపిడీ జరిగిందని, ఇవాళ అన్ని అక్రమాలపై విచారణకు ఆదేశించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మళ్లీ నేడు ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో తాము ఏదో తప్పు చేసినట్లుగా, చెల్లింపుల్లో ఆలస్యం చేస్తున్నట్లుగా ప్రధాన ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో ఏపీ రాజ్యసభ సభ్యుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి మాట్లాడుతున్నారని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఆయన భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో పెడితే ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వందకు వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేశాక.. ఆర్.కృష్ణయ్య గానీ, బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు, కిషన్ రెడ్డి గానీ తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి మాట్లాడాలని హితవు పలికారు.
కబ్జాలు చేస్తే బడా బాబులైనా, పేదలైనా ఊరుకోం
హైడ్రాను రద్దు చేయాలని దొంగలు, కబ్జాకోరులు, బీఆర్ఎస్ వాళ్లు మాత్రమే అంటున్నారని సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. గండిపేట బతుకమ్మ కుంటలను ఆక్రమించింది పేదల.. పెద్దలా? ఎన్ కన్వెన్షన్ పేదలదా.. పెద్దలదా? అని ప్రశ్నించారు. కబ్జాలు చేస్తే బడా బాబులైనా, పేదలైనా ఊరుకోమని స్పష్టం చేశారు. హైడ్రా అనేది తాము తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణ అని, ఏ అధికారిని నియమించాలనే విచక్షణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని తెలిపారు. సోమేశ్ కుమార్ పైన 400 పైగా కోర్టు ధిక్కరణ కేసులున్నాయని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నేతలు దురుద్దేశంతో కేసులు వేసి కోర్టును తప్పుదోవ పట్టించారని, కోర్టు తీర్పుని పరిశీలించి తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. హైడ్రా కార్యాచరణపైన తమకు పూర్తి స్పష్టత ఉందని, కబ్జాకోరులకు మీడియా కూడా సహకరించవద్దని విజ్ఞప్తి చేశారు. డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.






