Singareni: ఈ నెల 23 నుంచి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం ఆన్ లైన్ దరఖాస్తులు

by Prasad Jukanti |

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం ఆన్ లైన్ దరఖాస్తుల విషయంలో సింగరేణి కీలక ప్రకటన చేసింది.

Singareni: ఈ నెల 23 నుంచి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం ఆన్ లైన్ దరఖాస్తులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి (Singareni) కాలరీస్ సామాజిక బాధ్యతతో చేపట్టిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం (Rajiv Gandhi Civils Abhaya Hastham) పథకం ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ (N.Balaram) శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఈ నెల 23వ తేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల విడుదలై సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. యూపీఎస్సీ (UPSC) సివిల్స్ ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులైన సింగరేణి కార్మికుల పిల్లలకు కూడా రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం అందించనున్నట్లు వెల్లడించారు. దేశంలోనే ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమవుతున్న తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు ఆర్థిక ప్రతిబంధకాలను తొలగించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సూచనతో సింగరేణి సామాజిక బాధ్యత నిధులతో గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం మంచి ఫలితాన్ని ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

గత ఏడాది 140 మంది ప్రిలిమ్స్ పాసైన వారికి సాయం అందించగా.. 20 మంది మెయిన్స్ లోనూ ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారని, ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి మరో లక్ష రూపాయల సాయం కూడా అందించామని, వారిలో ఏడుగురు సివిల్స్ లో సత్తా చాటారని వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో ఈ ఏడాది కూడా మరింత మందికి ప్రోత్సాహం అందించేందుకు దీన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు సింగరేణి వెబ్ సైట్ www.scclmines.com ను సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. సివిల్స్ మెయిన్స్ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశమని దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Next Story