- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫామ్రైతుల కోసం మరో ఆయిల్ పామ్ కర్మాగారం: మంత్రి తుమ్మల
రాష్ట్రంలో ఆయిల్ పామ్ రైతుల కోసం మరో ఆధునిక ఆయిల్ పామ్ కర్మాగారాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఆయిల్ పామ్ రైతుల కోసం మరో ఆధునిక ఆయిల్ పామ్ కర్మాగారాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం అంజనాపురంలో గోద్రెజ్ కంపెనీ నిర్మిస్తున్న ఆయిల్ పామ్ కర్మాగారం పనులు ప్రస్తుతం తుదిదశలో ఉన్నాయని, త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉందని, అందుకోసం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన ఆకంపెనీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా సీడ్ గార్డెన్‌లో అధిక నూనె దిగుబడి ఇచ్చే, పొట్టి రకాల ఉత్తమ ఆయిల్ పామ్ మొక్కలను అభివృద్ధి చేయాలని వారికి సూచించారు. ఆయిల్పామ్కర్మాగారం సుమారు రూ.250 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారని, గంటకు 15 టన్నుల ఆయిల్ పామ్ గెలలను క్రష్ చేసే సామర్థ్యంతో ఏర్పాటు అవుతోందన్నారు. ఈ పరిశ్రమ ద్వారా 150 మందికి ప్రత్యక్షంగా, 700 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
గోద్రెజ్ సంస్థ ఇప్పటికే వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, వంటనూనెలు, సబ్బులు, ఆహార ఉత్పత్తుల తయారీలో ప్రముఖ స్థానంలో ఉందని, పామాయిల్‌ను తమ ఉత్పత్తులకు ముడిసరుకుగా వినియోగించే సామర్థ్యం ఉన్నందునే ఈ అవకాశాన్ని కల్పించినట్లు వివరించారు. రైతులకు గెలల ధరను నిర్ణయించే ఓఈఆర్ పై ప్రైవేట్ కంపెనీలు కోర్టుకు వెళ్లడం మంచిది కాదని, రైతులకు ఇబ్బందులు కలిగించే చర్యలు మానుకోవాలని సూచించారు. ఆయిల్ ఫెడ్ వారిచే నడుస్తున్న మిల్లులలో ఏ మిల్లులలో అయితే ఎక్కువ ఓఈఆర్వస్తుందో దానిని గెలల ధరను నిర్ణయించడానికి ప్రామాణికంగా తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అప్పారావుపేట, అశ్వరావుపేటలలో ఆయిల్ పామ్ కర్మాగారాలు రైతులకు సేవలందిస్తున్నాయని, ఇటీవల సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో మరో ఆధునిక ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించామని, అంజనాపురం కర్మాగారంతో పాటు రాష్ట్రంలో మరో ఐదు ఆయిల్ పామ్ కర్మాగారాల నిర్మాణ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
2.97 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్సాగు :
రాష్ట్రంలో ప్రస్తుతం 81,263 మంది రైతులు సుమారు 2.97 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. కొత్త కర్మాగారాలు అందుబాటులోకి రావడం ద్వారా మరింత మంది రైతులు ఆయిల్ పామ్ సాగుపై ఆసక్తి చూపే అవకాశం ఉందన్నారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరించే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపాలని సూచించారు. సాగు చేస్తున్న రైతులు నేటి పరిస్థితుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్నారని, ఉద్యోగులకు నెలకు ఒకసారి వేతనం వస్తే, ఆయిల్ పామ్ రైతులకు ప్రతి 20 రోజులకు ఒకసారి ఆదాయం లభిస్తుందని తెలిపారు. ప్రస్తుతం టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ.23,852గా ఉందని, ఇది పామాయిల్ చరిత్రలోనే అత్యధిక ధర అని చెప్పారు.






