- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్ష ఇందిరమ్మ ఇళ్లే టార్గెట్..! ఏఐ టెక్నాలజీతో అక్రమాలకు చెక్

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోగా కనీసం లక్ష ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. పథకం అమలులో లోపాలు లేకుండా.. పూర్తి పారదర్శకతతో అటువైపు అడుగులు వేస్తున్నది. అక్రమాలకు తావులేకుండా కేవలం అర్హులైన నిరుపేదలకే లబ్ధి చేకూరాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నది. దీని కోసం తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను రంగంలోకి దించింది. సాధారణంగా ప్రభుత్వ పథకాల్లో రాజకీయ జోక్యం లేదా క్షేత్రస్థాయి పరిశీలనలో లోపాల వల్ల అనర్హులు ప్రయోజనం పొందుతుంటారు. కానీ.. ఈ పథకంలో వాటికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం 360 డిగ్రీల విధానాన్ని అమలు చేస్తున్నది. ప్రతి దరఖాస్తుదారుడి ఆధార్ సంఖ్యను ఇతర ప్రభుత్వ డేటాబేస్‌లతో అనుసంధానించి బిల్లులు చెల్లిస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో టైం టు టైం బిల్లులు చెల్లిస్తూ లబ్ధిదారులకు భరోసాగా నిలుస్తున్నారు.
మార్చిలోగా లక్ష ఇండ్లు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. రూ.22,500 కోట్లతో వీటి నిర్మాణం చేపట్టింది. వీటిలో ఇప్పటివరకు 2,48,770 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా.. మార్చి పూర్తయ్యేలోపు లక్ష ఇళ్లు నిర్మాణం పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటివరకు 77,334 ఇళ్లు బేస్మెంట్ లెవల్, 41,555 ఇళ్లు గోడల వరకు పూర్తయ్యాయి. 74,561 ఇళ్లు స్లాబ్ వరకు కంప్లీట్ అయ్యాయి. అలాగే.. 2,504 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో మూడు నెలల్లో లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం, అధికారులు ముందుకు సాగుతున్నారు.
రూ.3,853 కోట్ల బిల్లుల చెల్లింపు
ఇందిరమ్మ పథకంలో ఇప్పటివరకు రూ.3,853.66 కోట్ల బిల్లులను లబ్ధిదారుల ఖాతాల్లో చేశారు. వీటిలో బేస్మెంట్ లెవల్ పూర్తిచేసిన ఇళ్లకు రూ.1,821.76 కోట్లు, రూఫ్ లెవల్ కంప్లీట్ అయిన వాటికి రూ.1,038.08 కోట్లు, స్లాబ్ పూర్తయిన వాటికి రూ.993.82 కోట్లు చెల్లించారు.
ఏప్రిల్ నుంచి రెండో విడత..
రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవలే ప్రకటించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి వ్యక్తికి సొంతింటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఏటా రెండు విడతలుగా ఇళ్ల మంజూరు కొనసాగనుంది. ఏఐ సాంకేతికత ద్వారా సదరు వ్యక్తికి ఇప్పటికే వేరే చోట సొంత ఇల్లు ఉన్నదా? విలువైన భూములు ఉన్నాయా? లేదా కారు వంటి విలాసవంతమైన వాహనాలు ఉన్నాయా? అనే విషయాలను తెలుసుకుంటున్నారు. అలా గుర్తించి రాష్ట్రవ్యాప్తంగానూ వేల సంఖ్యలో దరఖాస్తులను అధికారులు రద్దు చేశారు. గతంలో బిల్లులు పొందిన వారు సైతం ప్రస్తుత ఏఐ ఫిల్టరింగ్‌లో అనర్హులుగా తేలితే, తదుపరి చెల్లింపులను నిలిపివేస్తున్నారు. ప్రజాపాలనలో వచ్చిన లక్షలాది దరఖాస్తులను అధికారులు శాస్త్రీయంగా మూడు విభాగాలుగా విభజించారు. ఎల్-1 జాబితాలో సొంత స్థలం ఉండి, నివసించడానికి ఇల్లు లేని నిరుపేదలు ఉండగా.. వీరికి మొదటి విడతలో ఇళ్లు మంజూరు చేస్తున్నారు. ఎల్-2 జాబితాలో సొంత స్థలం, ఇల్లు రెండూ లేని వారు ఉన్నారు. వీరికి తదుపరి దశలో ప్రభుత్వమే స్థలం కేటాయించి ఇల్లు నిర్మించి ఇస్తుంది. ఎల్-3 జాబితాలో వివిధ సాంకేతిక కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్న లేదా అదనపు పరిశీలన అవసరమైన దరఖాస్తులు ఉన్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా.. క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల ఐరిస్ స్కాన్ చేస్తున్నారు. దీనివల్ల ఒకే వ్యక్తి రెండుసార్లు లబ్ధి పొందడం లేదా ఇతరుల పేర్లతో మోసాలకు పాల్పడటం సాధ్యపడదు.
కేంద్రం వాటా కోసం ఎదురుచూపు
ఇందిరమ్మ ఇళ్ల పథకం నిధుల్లో కేంద్రం వాటా కూడా అందనుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో కేంద్రం చెప్పిన నిబంధనలను పాటిస్తున్నారు. కేంద్రం రూల్స్ ప్రకారమే ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. దాంతో కేంద్రం నుంచి కూడా ఈ పథకానికి ఆర్థిక చేయూత అందనుంది. అయితే.. ఇప్పటికే ఆ నిధులు రావాల్సి ఉన్నా ఇంకా ఎదురుచూపులు మాత్రం తప్పడం లేదు. ఇంటి నిర్మాణానికి ఇచ్చే మొత్తం రూ.5 లక్షల్లో కేంద్రం రూ.1.11 లక్షలు మంజూరు చేస్తుండగా.. మిగతా రూ.3.89 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఒక్కో ఇందిరమ్మ ఇంటికి పీఎం ఆవాస్ యోజన కింద కేంద్రం రూ.72వేలు ఇస్తుంది. ఉపాధి హామీ ద్వారా రూ.27వేలు చెల్లించనుంది. (లబ్ధిదారుకు జాబ్ కార్డు ఉంటే ఇంటి పని కింద 90రోజులు పనిచేసినందుకు రోజుకు రూ.300 చెల్లించనుంది) అలాగే స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద మరో రూ.12వేలు ఇవ్వనుంది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం పైనా కొంత మేర భారం తగ్గనుంది. అయితే.. కేంద్రం నిధుల విషయంలో నిత్యం కేంద్రంతో సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఈ నెల 16న మరోసారి కేంద్రంతో ఢిల్లీలో కీలక మీటింగ్ జరగనుంది. ప్రత్యేకించి ఈ నిధుల విషయమై అధికారులు ఢిల్లీలో అధికారులతో సమావేశం కానున్నారు. దాదాపు ఈ సమావేశంలో ఈ సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






