Kavitha: వందిమాగధులతో మాట్లాడించడం కాదు.. హరీశ్ రావుపై కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-11-17 11:12:36  IST  )

వస్తున్న ఆరోపణలపై హరీశ్ రావే మాట్లాడాలని కవిత వ్యాఖ్యానించారు.

Kavitha: వందిమాగధులతో మాట్లాడించడం కాదు.. హరీశ్ రావుపై కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్‍లో కవిత ఆరోపణలు సంచలనంగా మారాయి. మాజీ మంత్రి హరీశ్ రావును (Harish Rao) కవిత పదే పదే టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలో కవిత (Kavitha) ఆరోపణలకు నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇవ్వడంపై తాజాగా కవిత స్పందించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించిన కవిత... మరోసారి హరీశ్ రావుపై విమర్శలు గుప్పించారు. హరీశ్ రావు మీద ఆరోపణలు వస్తే ఆయన వివరణ ఇవ్వాలి తప్ప ప్రతిసారి వందిమాగధులు తమ తరఫున మాట్లాడుతారంటే ప్రజాస్వామ్యంలో కుదరదన్నారు. ఆరోపణలు వచ్చిన వ్యక్తులు సమాధానం చెబుతారా లేదా అన్ని ప్రజలు గమనిస్తారన్నారు. పిల్లి మీద పిట్ట మీద పెట్టి వాళ్లతో వీళ్లతో తిట్టిస్తామంటే ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రేపు మీడియా సమావేశంలో అన్ని విషయాలు మాట్లాడుతానన్నారు.

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవటమనేది ప్రధాన ప్రతిపక్షాల వైఫల్యమేనని కవిత ఆరోపించారు. సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి అడ్వంటేజ్ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇతర పార్టీలు గెలిచిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మీద చాలా వ్యతిరేకత ఉందని గ్రామాల్లోకి వెళితే ప్రజలు ఆ పార్టీని తిడుతున్నారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా నేరవేర్చలేదు. ఆరు గ్యారంటీలు అమలు కావటం లేదన్నారు. అయినా కూడా కాంగ్రెస్ గెలిచిందంటే ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ స్పష్టంగా విఫలమైందని అర్థం అవుతోందని దుయ్యబట్టారు. ప్రజల సమస్యలపై చేయాల్సినంత పోరాటం ఆ పార్టీలు చేయటం లేదని అందుకే ఆ బాధ్యతను తెలంగాణ జాగృతి తన భుజాన వేసుకుందన్నారు.

Next Story