- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ పట్టభద్రులు ఎవరి వైపు..! ఎమ్మెల్యేల సపోర్టు ఆయనకేనా?
కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి హోరాహోరీగా ప్రచారం సాగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి హోరాహోరీగా ప్రచారం సాగుతున్నది. ఈ స్థానానికి గతంలో ఎన్నడూ లేని విధంగా పోటాపోటీ నెలకొంది. అందులోనూ అధికార పార్టీకి సంబంధించిన ఓటర్ల విషయంలో ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతున్నది. వాస్తవానికి బీఎస్పీ నుంచి బరిలోకి దిగిన ప్రసన్న హరికృష్ణ ముందు నుంచీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే. ఆయన అధికార పార్టీ టికెట్‌ను ఆశించారు. చాలా సందర్భాల్లోనూ అధిష్టానం పెద్దలను కూడా కలుసుకున్నారు. టికెట్ కోసం రిక్వెస్ట్ పెట్టుకున్నారు. కానీ.. అధిష్టానం చివరి నిమిషంలో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డికి బీ ఫామ్‌ను అందించింది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన పట్టభద్రుల ఓట్లు ఎవరికి పడుతాయనే చర్చ జోరుగా సాగుతున్నది. మొన్నటివరకు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడంతో ఓట్లు చీలిపోయే ప్రమాదం లేకపోలేదు.
ఆరు నెలల ముందు నుంచే ప్రచారం
ప్రసన్న హరికృష్ణ ఎమ్మెల్సీ ఎన్నికలు రాకముందే ఆరు నెలల ముందు నుంచే ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. తన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ఆయన ఎమ్మెల్సీగా రంగంలోకి దిగారు. అయితే.. ఎమ్మెల్సీగా పోటీచేయాలని అనుకున్నప్పటి నుంచే హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ తనకే వస్తుందని భరోసాతో ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను, పట్టభద్రులను కలుస్తూ వచ్చారు. వారి మద్దతును కోరుతూ వచ్చారు. ఆయన చేసిన ఎన్‌రోల్‌మెంట్‌లోనూ దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిమానులే ఉన్నారనేది టాక్. మరోవైపు.. నరేందర్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. దీంతో ఇప్పటికి కూడా ఆ ఓటర్లు మెజార్టీ స్థాయిలో ఇంకా ప్రసన్న హరికృష్ణకే మద్దతు తెలుపుతున్నారన్న ప్రచారం జరుగుతున్నది. పైకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నామని చెబుతున్నా.. చివరకు మొదటి ప్రాధాన్య ఓటు మాత్రం అపోజిషన్ అభ్యర్థికే వేయాలని సిద్ధపడినట్లు తెలుస్తున్నది.
ఎమ్మెల్యేల అలక?
మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన నరేందర్‌రెడ్డిపై పలు ఆరోపణలు ఉన్నాయి. నాలుగు ఉమ్మడి జిల్లాల నేతలను ఎవరినీ సంప్రదించకుండానే హైకమాండ్ నరేందర్‌రెడ్డి పేరును ప్రకటించినట్లుగా ప్రచారం ఉంది. ఇది కాస్త ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నేతల్లో గుస్సాకు కారణమైందట. నరేందర్‌రెడ్డి ధన బలంతో డైరెక్ట్ హైకమాండును ప్రసన్నం చేసుకొని టికెట్ పొందారన్న ప్రచారం ఉంది. అధిష్టానం కూడా తెలంగాణ నేతలను సంప్రదించకుండానే టికెట్ అనౌన్స్ చేసినట్లు సమాచారం. అంతేకాదు.. ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో తిరిగింది లేదు అన్న టాక్ నడుస్తున్నది. ఏనాడూ ఏ ఎన్నికల్లో కూడా ప్రచారంలో కూడా పాలు పంచుకున్నది లేదని అంటున్నారు. అందుకే.. ఇప్పుడు నరేందర్‌రెడ్డి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు సహకరించడం లేదని ప్రచారం జరుగుతున్నది.
ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు నరేందర్‌రెడ్డికి అంటిముట్టనట్లుగా ఉంటున్నారని సమాచారం. వారు లోలోపల ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా నిలుస్తున్నారని టాక్ నడుస్తున్నది. అలాగే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కూడా నరేందర్‌రెడ్డికి మద్దతు తెలపడం లేదని సమాచారం. ఇటీవల ఆ ఎమ్మెల్యేకు సంబంధించిన నియోజకవర్గంలో నరేందర్‌రెడ్డి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యారట. కానీ.. అందుకు ఆ ఎమ్మెల్యే ఒప్పుకోలేదని సమాచారం. దీంతో ఇప్పుడు నరేందర్‌రెడ్డి మరో నేతను పట్టుకొని ఆ ఎమ్మెల్యే వద్దకు వెళ్లారని సమాచారం. సమ్మేళనం నిర్వహించేందుకు అంగీకరించాలని విజ్ఞప్తి చేశారని తెలిసింది. అయినా కూడా ఆ ఎమ్మెల్యే అంగీకరించడం లేదని తెలిసింది. వీటన్నింటిని చూస్తుంటే నరేందర్‌రెడ్డికి సొంత పార్టీలోనే ఎదురీత తప్పడం లేదన్న ప్రచారం జరుగుతున్నది.






