BC Reservations: రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తే.. బీఆర్ఎస్, బీజేపీలకు మంత్రి పొన్నం హెచ్చరిక

by Prasad Jukanti |   (  Updated:2025-07-14 07:46:25  IST  )

బీసీ రిజర్వేషన్లపై ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం కౌంటర్ఇచ్చారు.

BC Reservations: రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తే.. బీఆర్ఎస్, బీజేపీలకు మంత్రి పొన్నం హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను (BC reservations) త్వరగా అమలు చేసేందుకే ఆర్డినెన్స్ తీసుకువస్తుంటే కాళ్లలో కట్టెలు పెట్టేలా బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మండిపడ్డారు. కోర్టు ఆదేశాలతో చట్టపరమైన అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని కలుగణన నిర్వహించి బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయబోతున్న చారిత్రాత్మక సందర్భంలో దుర్భుద్దితో ఆలోచించవద్దని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను కోరారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తీసుకురాబోయే ఆర్డినెన్స్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బీజేపీలో నిజంగా లక్ష్మణ్ మాట చెల్లుబాటు అయితే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి గవర్నర్ సంతకంతో రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింప చేసి 9వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై న్యాయపరమైన సమస్యలు సృష్టించాలని చూస్తున్నారని అలాంటి వారికి బీసీలు బుద్ధిచెప్పడం ఖాయం అన్నారు. చట్టంతో పాటు ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ముందుకు సాగుతున్న తరుణంలో బీసీల పట్ల మీకున్న అనుమానాలేంటని ప్రశ్నించారు. రిజర్వేషన్ల అమలు విషయంలో మరింత మెరుగాగా ఎలా ముందుకు వెళ్లాలో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.

ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి వద్ద ఉన్న బిల్లుకు సంబంధం లేదు:

అసెంబ్లీ రన్నింగ్ లో లేనప్పుడు ఆర్డినెన్స్ తీసుకువచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి వద్ద ఉన్న బిల్లుకు సంబంధం లేదన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు, మీడియా అర్థం చేసుకోవాలన్నారు. ఈ ఆర్డినెన్స్ విషయంలో భిన్నాప్రాయాలు వచ్చేలా కావాలనే బీజేపీ రాజకీయం చేయాలని చూస్తోందన్నారు. 2018 పంచాయతీ రాజ్ యాక్ట్ లో నాడు కోర్టు తీర్పులకు అనుగుణంగా రిజర్వేషన్ల సీలింగ్ 50 శాతం ఉందని ఆ క్లాజ్ తీసేసేందుకు ఆర్డినెన్స్ తీసుకువస్తున్నామన్నారు. దీన్ని ముందుగానే ఊహించుకుని న్యాయపరమైన చిక్కులు వస్తాయని అంటున్నారని చిక్కులు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. మీ పార్టీలే కోర్టులకు వెళ్లి చిక్కులు తేవాలని చూస్తున్నారా అని నిలదీశారు. బీజేపీ పార్టీ తన మనువాద సంప్రదాయం ప్రకారం రిజర్వేషన్లను అడ్డుకుననే కుట్ర చేస్తున్నదని గతంలోనూ మండల్ కమిటీ పేరుతో రిజర్వేషన్లు తెస్తే కమండల్ పేరుతో రిజర్వేషన్లను వ్యతిరేకించిన పార్టీ బీజేపీ అని పొన్నం దుయ్యబట్టారు. రాష్ట్రమంతటా బీసీల చుట్టు చర్చ జరుగుతుంటే ఫ్యూడలిస్ట్ మెంటాలిటితో కొత్త అధ్యక్షుడిని బీజేపీ నియమించిందని మీరా మాగురించి మాట్లాడేదని లక్ష్మణ్ పై మండిపడ్డారు.

బీఆర్ఎస్, బీజేపీలపై బీసీ నేతలు ఒత్తిడి పెంచాలి:

బీసీల రిజర్వేషన్ల అమలు విషయంలో బీఆర్ఎస్, బీజేపీలోని బీసీ నేతలంతా వారి అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని పొన్నం సూచించారు. బీసీ నేతలు, పార్టీ పదవుల కోసం బీసీ రిజర్వేషన్లను తాకట్టు పెట్టొద్దని కోరారు. బీసీల రిజర్వేషన్లపై బీజేపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని గవర్నర్ నే ఇన్లూయెన్స్ చేసేలా లక్ష్మణ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పారదర్శకంగా జరుగుతున్న ఈ రిజర్వేషన్ల అంశంపై దుర్భుద్దితో ఆలోచించవద్దన్నారు. ప్రధాని మోడీ అపాయింట్ మెట్ కోరితే ఇవ్వలేదని దాంతో తాము కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తులు చేశామన్నారు. రాష్ట్రపతి వద్ద పెడింగ్ లో ఉన్న బీసీ బిల్లు అమలుకు తెలంగాణ బీజేపీలోని బీసీ ఎంపీలు ప్రయత్నించాలన్నరు. రాష్ట్ర మంత్రివర్గం లేదా అఖిలపక్షం ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు.

Next Story