తెలంగాణలో చమురు నిల్వలు ఫుల్: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది.

తెలంగాణలో చమురు నిల్వలు ఫుల్: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందని సోషల్ మీడియా (Social Media)లో వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్న వేళ పుకార్లకు తెలంగాణ ప్రభుత్వం తెరదించింది. తెలంగాణ వ్యాప్తంగా చమురు, ఎల్పీజీ (LPG) గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని పౌర సరఫరాల శాఖ (Civil Supplies Department) స్పష్టం చేసింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తాజా గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ప్రతిరోజూ సుమారు 24,000 కిలోలీటర్ల చమురు సరఫరా జరుగుతోంది. ఇందులో పెట్రోల్ 9,574 కిలోలీటర్లు, డీజిల్ 14,457 కిలోలీటర్లుగా ఉన్నాయని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఎల్పీజీ సిలిండర్లు రోజుకు 2.22 లక్షలకు పైగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ నిరంతరాయంగా సాగుతోందని స్పష్టం చేశారు.

పుకార్లను నమ్మకండి..

రాష్ట్రంలో ఇంధన కొరత ఉందని వస్తున్న వదంతుల వల్ల చాలా మంది వినియోగదారులు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. దీంతో కృత్రిమ కొరత (Artificial Scarcity) ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆయిల్ రిఫైనరీల నుంచి డిపోలకు చైన్ సప్లయ్ (Supply Chain) అత్యంత సజావుగా ఉందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వినియోగదారులకు ఏవైనా అనుమానాలు ఉన్నా, లేదా ఎక్కడైనా కృత్రిమ కొరత సృష్టించినా.. అధిక ధరలకు విక్రయించినా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 19672కు ఫిర్యాదు చేయవచ్చని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. అదేవిధంగా అక్రమంగా పెట్రోల్, డీజిల్‌‌ను నిల్వ చేసే వారు లేదా బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. బంకుల వద్ద రద్దీ తగ్గించేందుకు సహకరించాలని, నిల్వల గురించి అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేసింది.

Next Story