నర్మెట్టలో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్.. రూ. 300 కోట్లతో నిర్మాణం : మంత్రి తుమ్మల

by Ramesh Naini |

ఈ నెల 22వ తేదీన సిద్దిపేట జిల్లా నంగునూరు మండల నర్మెట్టలో ఆధునిక ఆయిల్ ​పామ్ ​ప్రాసెసింగ్​ యూనిట్​ సీఎం రేవంత్​ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు.

నర్మెట్టలో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్.. రూ. 300 కోట్లతో నిర్మాణం : మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఈ నెల 22వ తేదీన సిద్దిపేట జిల్లా నంగునూరు మండల నర్మెట్టలో ఆధునిక ఆయిల్ ​పామ్ ​ప్రాసెసింగ్​ యూనిట్​ సీఎం రేవంత్​ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడుతోందన్నారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పేర్కొంటూ ప్రస్తుతం రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో స్థాపించబడిన రెండు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లులు నిర్వహణలో ఉన్నాయన్నారు. ఈ మిల్లుల సమిష్టి సామర్థ్యం గంటకు 120 మెట్రిక్ టన్నులుగా ఉందని, ఈ ప్రాసెసింగ్ యూనిట్లు ఆయిల్ పామ్ రైతులు పండించే పండ్లను త్వరితగతిన ప్రాసెస్ చేసి వారికి సరైన మార్కెట్ అవకాశాలు కల్పిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ సుమారు రూ.300 కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని నిర్మించిందన్నారు. ప్రారంభ దశలో ఈ యూనిట్ గంటకు 30 టన్నుల (30 టీపీహెచ్​) సామర్థ్యంతో పని చేయనుండగా, భవిష్యత్తులో దీనిని గంటకు 120 టన్నుల (120 టీపీహెచ్​) వరకు విస్తరించే విధంగా రూపకల్పన చేసినట్లు చెప్పారు. ఈ ఆధునిక ప్రాసెసింగ్ యూనిట్ ఆయిల్ పామ్ రైతులకు ఎంతో మద్దతుగా నిలవనుందని పేర్కొన్నారు. ఈ యూనిట్ ప్రారంభంతో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ సౌకర్యాలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.

ఈ నెల 20 నుంచి 22 వరకు రైతు మేళా

రైతులు తమ పంటలను నేరుగా ఈ ప్రాసెసింగ్ యూనిట్‌కు తీసుకువచ్చి ప్రాసెస్ చేయించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆధునిక సాంకేతికతతో నూనె తయారీ జరగడంతో నాణ్యత మెరుగుపడటంతో పాటు రైతులకు మెరుగైన ధరలు లభించే అవకాశం ఉంటుందన్నారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు రైతు మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేళాలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన యంత్రాలు, ఆయిల్ పామ్ సాగు విధానాలు, ఉత్పత్తి పెంపు మార్గాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వివిధ శాఖల స్టాళ్లు ఏర్పాటు చేసి రైతులకు ప్రత్యక్షంగా సమాచారం అందిస్తామన్నారు.

Next Story